Thursday, January 22, 2026
Homeలైఫ్ స్టైల్Fridge: చలికాలంలో వీటిని ఫ్రిజ్‌ లో పెట్టకూడదని తెలుసా!

Fridge: చలికాలంలో వీటిని ఫ్రిజ్‌ లో పెట్టకూడదని తెలుసా!

Vegetables Not For Fridge: ఇళ్లలో ఎక్కువగా కనిపించే అలవాటు ఏంటంటే కూరగాయలు, పండ్లు కొనగానే ఫ్రిజ్‌లో పెట్టేయడం. ముఖ్యంగా వారం రోజులకు సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకొచ్చే వారు ఎక్కువగా ఇలా చేస్తారు. ఫ్రిజ్‌లో పెట్టితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ చలికాలంలో ఈ అలవాటు ప్రతి కూరగాయకు సరిపోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు, అధిక తేమ వల్ల కొన్ని కూరగాయల్లో సహజ లక్షణాలు మారిపోతాయి. దాంతో రుచి తగ్గడమే కాకుండా పోషకాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.

- Advertisement -

సహజంగానే చల్లగా…

చలికాలంలో వాతావరణం సహజంగానే చల్లగా ఉంటుంది. అలాంటి సమయంలో కొన్ని కూరగాయలను బయట సరైన విధంగా ఉంచితే చాలాకాలం నిల్వ ఉంటాయి. కానీ వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి ఊహించినదానికంటే త్వరగా పాడవుతాయి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశముంటుంది. అందుకే చలికాలంలో ఫ్రిజ్‌లో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన కూరగాయల గురించి తెలుసుకోవడం అవసరం.

ఉల్లిపాయలు, వెల్లుల్లి..

ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి విషయానికి వస్తే ఇవి గది ఉష్ణోగ్రత వద్దనే బాగా నిల్వ ఉంటాయి. వంటగదిలో గాలి సరిగ్గా తగిలే బుట్టలో ఉంచితే చాలారోజులు పాడవకుండా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉండే తేమ కారణంగా ఉల్లిపాయలు త్వరగా పాడైపోతాయి. రుచి మారిపోతుంది. వెల్లుల్లిని తొక్క తీసి లేదా పేస్ట్‌గా చేసి ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు అందులో ఉండే సహజ గుణాలు తగ్గిపోతాయి. ఇవి వంటకాలకు ఇచ్చే వాసన, రుచి కూడా తగ్గుతుంది. అందుకే ఈ రెండింటిని ఫ్రిజ్‌కు దూరంగా ఉంచడం మంచిది.

టమాటాలు..

టమాటాలు కూడా ఫ్రిజ్‌కు సరిపోని కూరగాయల్లో ఒకటి. చల్లని వాతావరణంలో టమాటాల లోపలి నిర్మాణం మారిపోతుంది. దాంతో అవి పచ్చగా కనిపించినా తిన్నప్పుడు రుచి ఉండదు. టమాటాల్లో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్లు అధిక చలిలో దెబ్బతింటాయి. చలికాలంలో టమాటాలను బయట ఉంచినా సాధారణంగా వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. బయటే సరైన చోట ఉంచడం వల్ల అవి సహజ రుచితో పాటు పోషకాల్ని కూడా కాపాడుకుంటాయి.

బంగాళాదుంపలు..

బంగాళాదుంపల విషయంలో చాలామంది పొరపాటు చేస్తుంటారు. ఫ్రిజ్‌లో పెట్టితే అవి ఎక్కువకాలం నిల్వ ఉంటాయని అనుకుంటారు. కానీ వాస్తవం మాత్రం భిన్నంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతల్లో బంగాళాదుంపల్లో ఉండే స్టార్చ్ త్వరగా చక్కెరగా మారుతుంది. ఇది వంటకాల్లో రుచిని మార్చడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహ సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అంతేకాదు ఫ్రిజ్‌లో ఉంచిన బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీటిని చల్లని కానీ పొడి ప్రదేశంలో ఉంచడం ఉత్తమం.

అల్లం కూడా…

అల్లం కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడని జాబితాలో ఉంటుంది. అల్లం తేమను ఎక్కువగా పీల్చుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉండే తేమ వల్ల దానిపై శిలీంధ్రాలు త్వరగా పెరుగుతాయి. ఇలా ఫంగస్ పట్టిన అల్లాన్ని వాడితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయానికి హాని కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్లంను బయట పొడి ప్రదేశంలో ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.

ఆకుకూరల విషయంలో…

ఆకుకూరల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చాలా మంది ఆకుకూరలను కొనగానే ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. కానీ నిపుణుల సూచన ప్రకారం ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు. గరిష్టంగా కొన్ని గంటల వరకు మాత్రమే నిల్వ ఉంచాలని చెబుతున్నారు. ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంటే వాటి సహజ రంగు మారిపోతుంది. రుచి తగ్గుతుంది. ముఖ్యంగా పోషక విలువలు తగ్గిపోతాయి. ఆకుకూరలను అవసరమైనప్పుడే కొనుగోలు చేసి వెంటనే వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిది.

Also Read: https://teluguprabha.net/lifestyle/health-benefits-of-wearing-bangles-in-indian-tradition/

కాలీఫ్లవర్, క్యారెట్‌..

కాలీఫ్లవర్, క్యారెట్‌లాంటి కూరగాయలను కూడా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచకూడదు. చలిలో ఎక్కువసేపు ఉంటే ఇవి నీటిని కోల్పోయి వాడిపోయినట్లుగా మారుతాయి. రుచి కూడా తగ్గిపోతుంది. ఈ కూరగాయలను బయట చల్లని, పొడి ప్రదేశంలో ఉంచితే సహజంగా ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అలాగే పోషకాలు కూడా కాపాడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News