Pins and needles: రాత్రి నిద్రలో మధ్యలో ఒక్కసారిగా లేచి చూసినప్పుడు చేతికి తిమ్మర్లు వచ్చినట్టుగా అనిపించిన అనుభవం చాలా మందికి ఉంటుంది. చేతి మీద స్పర్శ తగ్గినట్టుగా, సూదులు గుచ్చినట్టుగా చిమ్మటలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ సమయంలో చాలామందికి భయం కూడా కలుగుతుంది. కానీ ఇది చాలా సాధారణంగా జరిగే విషయం. పరిశోధనలు చెబుతున్నట్టు చూస్తే దాదాపు 33% మంది పెద్దల్లో వారానికి కనీసం ఒకసారి అయినా నిద్రలో చేతులు లేదా మణికట్టు భాగంలో తిమ్మర్లు అనుభవిస్తారు. వైద్య భాషలో దీనిని నాక్టర్నల్ పరేస్థీషియా అంటారు. సాధారణంగా ఇది పెద్ద ప్రమాదం కాదు. కానీ తరచుగా జరుగుతుంటే లేదా లేచిన తర్వాత కూడా ఎక్కువసేపు కొనసాగితే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
నాడిపై ఒత్తిడి ప్రధాన కారణం
రాత్రి సమయంలో చేతులకు తిమ్మర్లు రావడానికి ప్రధాన కారణం నాడిపై ఒత్తిడి పడటం. మనం నిద్రలో ఉన్నప్పుడు ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు ఉంటాం. ఆ సమయంలో చేతి నాడిపై ఒత్తిడి పడితే లేదా రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గితే సూదులు గుచ్చినట్టుగా చిమ్మటలు వస్తాయి. దీనినే చాలా మంది పిన్స్ అండ్ నీడిల్స్ అని అంటారు. ఇది శరీరం ఇచ్చే ఒక సంకేతం. అంటే ఆ భాగం మీద ఒత్తిడి పడుతోందని, పొజిషన్ మార్చుకోవాలని శరీరం చెప్పే సూచన. సాధారణంగా ఒత్తిడి తొలగిపోయిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే చేతికి మళ్లీ సాధారణ స్పర్శ వస్తుంది.
నిద్రలో పడుకునే విధానం కూడా కారణం
చాలాసార్లు మనం పడుకునే విధానం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది. ఉదాహరణకు మణికట్టు మడిచి పడుకోవడం, చేతిని తలకింద పెట్టుకోవడం, చేతి మీద తలను ఉంచి పడుకోవడం, లేదా శరీర బరువు మొత్తం చేతి మీద పడేలా పడుకోవడం వల్ల నాడిపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో చేతిలో తిమ్మర్లు, చిమ్మటలు అనిపిస్తాయి. ఈ కారణంగా చాలా మందికి రాత్రి సమయంలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Read Also: Raw garlic benefits: ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి.. ఆరోగ్యానికి వరమా? శాపమా?
దిండు ఎత్తు – శరీర పొజిషన్ ప్రభావం
దిండు ఎత్తు కూడా ఈ సమస్యలో కీలక పాత్ర పోషిస్తుంది. దిండు చాలా ఎత్తుగా లేదా చాలా తక్కువగా ఉంటే మెడ, వెన్నెముక సరైన పొజిషన్‌లో ఉండవు. దాంతో నాడులపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల చేతులకు వెళ్లే రక్తప్రసరణ కొంతసేపు తగ్గిపోతుంది. అప్పుడు చేతులకు తిమ్మర్లు వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి సరైన ఎత్తులో ఉన్న దిండు ఉపయోగించడం చాలా ముఖ్యం.
కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం
కొన్ని సందర్భాల్లో చేతులకు తిమ్మర్లు రావడం వెనుక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. వాటిలో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి. ఇది నాడులు సరిగా పని చేయకపోవడం వల్ల వచ్చే సమస్య. ఈ పరిస్థితిలో చేతులు లేదా కాళ్లలో తిమ్మర్లు, చిమ్మటలు, కాలుతున్నట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్, విటమిన్ లోపాలు, కొన్ని ఇన్ఫెక్షన్లు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వంటి కారణాలు కూడా నాడి సమస్యలకు దారి తీస్తాయి.
చేతులకు తిమ్మర్లు వచ్చినప్పుడు ఏమి చేయాలి
నిద్రలో చేతికి తిమ్మర్లు వచ్చినట్టు అనిపించి లేచినప్పుడు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా శరీర పొజిషన్ మార్చుకుంటేనే సమస్య తగ్గిపోతుంది. చేతిని కొద్దిగా కదిపితే లేదా వేళ్లను స్ట్రెచ్ చేస్తే రక్తప్రసరణ మళ్లీ సాధారణంగా మారుతుంది. చేతిని నెమ్మదిగా షేక్ చేయడం, స్వల్పంగా మసాజ్ చేయడం, గోరువెచ్చని నీటిలో చేతిని కొద్దిసేపు ఉంచడం వంటి పద్ధతులు కూడా ఉపశమనం ఇస్తాయి. అయితే ఈ సమస్య తరచుగా వస్తే లేదా చేతిలో నొప్పి, బలహీనత కూడా ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

