True Wealth: సంపద అంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు. సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇక సంపాదించవలసిన అవసరం లేదన్న భావన కలగడం దాన్ని తృప్తి అంటారు. అది మనిషికి కలగని నాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరువు అవుతుంది. కంటి మీద కినుకే ఉండదు. తృప్తి కొంతమందికే అరుదైన ఆనంద సంపద. ‘మనిషికి కడవరకు తోడు ఉండాల్సింది ఏమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానం ఇస్తాడు యుధిష్టిరుడు. మన వెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మన మనోబలానికి సాటి రావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ మనో బలమే అద్భుతమైన సంపద. డబ్బుతోనే గౌరవ మర్యాదలు వస్తాయని అనడం కొంతవరకు వాస్తవమే. అయినా నిజమైన సంపద అది కాదు. మరి ఏది నిజమైన సంపద?
అమూల్యమైన జ్ఞాన సంపద
పెద్ద పెద్ద భవంతులు, ఎకరాల కొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పదనం గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద డబ్బు మాత్రమే కాదు. మనిషి ఏదైనా సాధించడానికి శరీరం అనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనం ఏమి చేయాలనుకున్నా ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్న సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నారు. ధర్మ సాధనకు ఈ శరీరమే సాధనం. “శరీర మాద్యం ఖలు ధర్మసాధనం” అన్నారు మహాకవి కాళిదాసు తమ కుమార సంభవ కావ్యంలో.
కష్ట కాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటం అన్నది ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు, విచక్షణ, వివేకాలని చెక్షువులను ఇచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు వేదాన్ని తెలుసుకొని మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని ప్రాముఖ్యతను కర్తవ్యాన్ని మనిషికి బోధపరచేది చదువే. ఇది చాలా విలువైన సంపద.
స్నేహపూర్వక ప్రవర్తన సంపద వంటిది
మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటి వారితో ఎలా మసులుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యుల నుంచి తన పెద్దల నుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవర్చుకోవాలి. అది సమాజంలో తోటి వారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలను ఇస్తుంది. సంబంధ బాంధవ్యాలను నిలుపుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిది.
ఆత్మ తృప్తికన్న మించిన సంపద లేదు
సంపద అంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడము కాదు. సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇక సంపాదించవలసిన అవసరం లేదన్న భావన కలగడం దాన్ని తృప్తి అంటారు. అది మనిషికి కలగని నాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరువవుతుంది. కంటి మీద కినుకే ఉండదు. తృప్తి కొంత మందికే దక్కే అరుదైన సంపద.
పెద్దలు చూపిన ధర్మపథంలో పయనించడమే సంపద
అద్భుతమైన తమ సృజన శక్తితో రమణీయమైన రచనలు చేసే సాహితీ వేత్తలు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మనవాళ్ళకి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే వీర సైనికులు, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలైన రైతన్నలు ఏ దేశానికైనా విలువైన సంపదలు అవుతారు. మహా పురుషులు అందించిన జ్ఞాన సంపద. మహనీయులైన మన పూర్వీకులు అందించిన విజ్ఞానం. పెద్దలు మన కోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు మన జీవితానికి ఒక క్రమశిక్షణను ప్రగతి పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనం ఇవ్వగలిగే అసలైన గౌరవం. అదే ఘనమైన సంపద.
మనోబలమే అన్నింటికన్నా గొప్ప సంపద
మన దేశమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టి స్వేచ్ఛా ఊపిరిలూదడంలో తను, మాన, ధన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగ ధనులు, తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు ఈ భరత జాతికి దక్కిన అమూల్య సంపద అనవచ్చు. “మనిషికి కడ వరకు తోడు ఉండాల్సింది ఏమిటి?” అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. అందుకు ‘మనోబలమ’ని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మన వెంట ఎందరున్నా, ఎంత సంపద ఉన్నా అవి మన మనోబలానికి సాటి రావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం మనిషికే ఎంతో అద్భుతమైన సంపద ఔతుంది. సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తించాలి. అప్పుడే జీవితానికి ఒక ఔన్నత్యం, సార్థ్యం చేకూరుతుంది.

