Telegram CEO Pavel Durov Life Without Alcohol: ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఎల్లప్పుడూ తన క్రమశిక్షణ, నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి. ఇటీవల ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో, దురోవ్ తన కఠినమైన ఆహార నియమాలు, ఉపవాస దినచర్య, “వ్యసనపూరిత” పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండటం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆల్కహాల్ బంద్.. ఎందుకంటే?
ఆల్కహాల్ (మద్యం) మానేయాలనే నిర్ణయం తన జీవితంలో చాలా త్వరగా తీసుకున్నానని దురోవ్ చెప్పారు. ఆల్కహాల్ మెదడు కణాలను స్తంభింపజేసి, దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుందని తాను తెలుసుకున్నట్లు చెప్పారు.
ALSO READ: ADHD Symptoms: అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట..
“మీ విజయం, ఆనందానికి మీ మెదడు అత్యంత విలువైన సాధనం అయినప్పుడు, స్వల్పకాలిక ఆనందం కోసం మీరు ఆ సాధనాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు?” అని ఆయన ప్రశ్నించారు. తాగమని సామాజిక ఒత్తిడి వచ్చినప్పుడు, “మీ సొంత నియమాలను మీరే సెట్ చేసుకోండి” అని ఆయన సలహా ఇచ్చారు.
షుగర్, కాఫీ, ఫాస్ట్ ఫుడ్ కూడా లేవు
టెలిగ్రామ్ సీఈఓ ఆహార నియమావళి కూడా అంతే క్రమశిక్షణతో కూడుకున్నది. ఆయన ప్రాసెస్డ్ షుగర్ (పంచదార), ఫాస్ట్ ఫుడ్, కాఫీ, సోడాలను పూర్తిగా నివారిస్తారు.
అతను ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) పాటిస్తాడు. అంటే రోజులో కేవలం ఆరు గంటల విండోలో మాత్రమే భోజనం చేస్తాడు, మిగిలిన 18 గంటలు ఉపవాసం ఉంటాడు. “ఇది మీ రోజుకు, మీ ఆహారపు అలవాట్లకు ఒక నిర్మాణాన్ని ఇస్తుంది. మీరు ఇకపై షుగర్‌ను కోరుకోరు” అని ఆయన వివరించారు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితమే రెడ్ మీట్ తినడం మానేసినట్లు దురోవ్ చెప్పారు, అది తనను బద్ధకంగా మార్చేదని అన్నారు. దానికి బదులుగా, అతను తన ప్రాథమిక పోషకాహార వనరులుగా సముద్రపు ఆహారం (Seafood), కూరగాయలను ఇష్టపడతాడు.
క్రమశిక్షణే స్వేచ్ఛ
దురోవ్ దృష్టిలో, క్రమశిక్షణ అంటే కోరికలను అణచివేయడం కాదు, అది ఆధారపడటం నుండి స్వేచ్చ పొందడం. మద్యం, కెఫిన్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను తన జీవితం నుండి తొలగించడం ద్వారా, తాను స్పష్టత, ఏకాగ్రత, శక్తిని కాపాడుకోగలిగానని ఆయన చెప్పారు. లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో ఆయన చెప్పినట్లుగా, “స్వల్పకాలిక ఆనందం కోసం మీ భవిష్యత్తును పణంగా పెట్టలేం.”
ALSO READ: Male Menopause Symptoms : వామ్మో! మగవాళ్లలో మోనోపాజ్.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం!


