HomeTop StoriesWork from Park: పార్కులోనే ఆఫీసు పని.. దుబాయ్‌లో కొత్తగా ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’ సదుపాయం

Work from Park: పార్కులోనే ఆఫీసు పని.. దుబాయ్‌లో కొత్తగా ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’ సదుపాయం

దుబాయ్‌(తెలుగు ప్రభ): కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగ ప్రపంచంలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’, ‘హైబ్రిడ్‌ వర్క్‌’ విధానాలు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు వీటికి మరో కొత్త విధానం తోడైంది. అదే ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’. ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా తమ విధులు నిర్వర్తించేందుకు దుబాయ్‌ మున్సిపాలిటీ ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దుబాయ్‌లోని అల్‌ బర్షా పాండ్‌ పార్క్‌లో ప్రత్యేకంగా ఈ వర్క్‌ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఇంటి నుంచి లేదా హైబ్రిడ్‌ విధానంలో పనిచేసే ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు కార్యాలయ వాతావరణానికి భిన్నంగా పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా పని చేసుకునేలా ఈ కాన్సెప్ట్‌ను రూపొందించారు. పార్కులో కూర్చొని పనిచేసేందుకు అవసరమైన వైఫై, విద్యుత్‌ సాకెట్లను ఏర్పాటు చేశారు. ఎండ, వేడి, బయటి వాతావరణ ప్రభావం లేకుండా సౌకర్యవంతంగా పనిచేయాలనుకునేవారి కోసం పార్కులోనే ఇండోర్‌ వర్క్‌స్పేస్‌ సదుపాయాలనూ కల్పించారు.

- Advertisement -

ఇండోర్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలనుకునేవారు రోజుకు 50 దిర్హమ్‌లు (సుమారు రూ.1,300) చెల్లించి పాస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, పార్కులోని సాధారణ ప్రదేశాల్లో కూర్చొని పనిచేసేవారికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, తమకు నచ్చిన వాతావరణంలో ఉచితంగానూ పని చేసుకునే అవకాశం కల్పించారు. దుబాయ్‌ మున్సిపాలిటీ, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ ప్లాట్‌ఫామ్‌ ‘లెట్స్‌ వర్క్‌’, నిర్మాణ సంస్థ ‘అమనా’ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలతో పార్కులో ప్రత్యేకంగా వర్క్‌స్పేస్‌ను ఏర్పాటు చేయడం దుబాయ్‌లో ఇదే తొలిసారని తెలుస్తోంది. సోమవారం నుంచే ఈ హబ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. పని వాతావరణంలో సరికొత్త మార్పును తీసుకొచ్చే ఈ ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’ విధానం ఉద్యోగులకు ప్రకృతికి చేరువగా ఉంటూనే విధులు నిర్వర్తించే అవకాశాన్ని కల్పిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News