పళ్లెం ముందు కూర్చుంటే
అన్నం సహించటం లేదు
ఆకలి పళ్లాలై
వీధుల నిండా పోటెత్తుతున్న
ఆ పిల్ల సముద్రాల్ని చూస్తుంటే
గుండెలు తరుక్కుపోతున్నాయి
మెతుకులు గొంతుకడ్డుపడుతున్నాయి
ఒక దేశం వీధుల నిండా
తూనీగలై తుళ్లిపడాల్సిన పిల్లలు
అన్నం బొచ్చెలై ఆకలితో క్యూ కట్టటం
ఎంత విషాదం
యుద్ధం గద్ద లాంటిది
పిల్లల్ని కోడిపిల్లల్లా తన్నుకెళుతుంది
యుద్ధం ఒక ఉన్మాది
అవసరమైతే బాంబులతో
లేదంటే ఆకలితో పిల్లల్ని పేల్చేస్తుంది
దేశాల మధ్య యుద్ధాలెందుకో
తెలీదు గానీ
దేశ దేశాల్లో పిల్లలుంటారు
యుద్ధమొస్తే తల్లుల శవాల మీద పడి
అనాథల్లా దుఃఖించే పసిమొగ్గలుంటారు
తల్లుల రొమ్ములు తెగిపడ్డాక
రోడ్లనిండా ఒలికిన పాలను వెతుక్కునే
దిక్కులేని పసికందులుంటారు
రేపటి దేశానికి నీడయ్యేందుకు
ఈరోజే నాటుకున్న మొక్కలు పిల్లలు
రేపటి తరాన్ని నిర్మించుకునేందుకు
ఈరోజే వేసుకున్న పునాదులు పిల్లలు
యుద్ధం మిగిల్చిన ఆకలితో
పిల్లల్ని పోగొట్టుకునే దేశమొక దేశమేనా?
ఆకలితో అలమటిస్తున్న పసిపిల్లల్ని
గుండెలకు హత్తుకుని పాలిచ్చే
తల్లిలాంటి దేశం కావాలిప్పుడు
దేశమంటే బొందల మట్టి కాదోయ్
దేశమంటే పిల్లలోయ్
అని పాడుకోవాలిప్పుడు !
– చిత్తలూరి

