మైసమ్మకు రాదు
మనిషిని నిలబెట్టే భాష
చెంచు భాగమతి చెదిరిపోయిన భాగ్యలక్ష్మికి రాదు
మనిషిని నిలబెట్టే భాష
మూసీ వొక నది కాదు
మనుషుల ప్రవాహం
మనసుల ప్రవాహం
మూసా ఈసీ కలెగలిసి
నిజ జీవితం వర్థిల్లే ప్రవాహం
ఇవాళ మురుగు కావొచ్చు మూసి
మనుషుల వాసన పరిమళించింది
మనుషులు మతాలు చెరో ఒడ్డై
మానవీయత ప్రవహించింది
ఏ మతమైనా ఏ భాషైనా
ఏ సంస్కృతైనా
ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు
మనిషిని నిలబెట్టింది
మనిషికి జై కొట్టింది
వొక కాలానికి
మసీదు ఒంట్లో అయినా
మందిర్ ఒంట్లో అయినా
మూసీ నీళ్ళే పారాయి
మోక్షగుండాలు
ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కాపలా ఉంచింది
అనూహ్య దినాల
ఆకస్మిక ఊబకాయంతో
ఊపిరి బంటి ముంచినా
ఎన్ని ఖాకీ తుపాకుల
నెత్తుటి దాహం తీర్చుకున్నా
ఎన్ని కత్తుల
నెత్తుటి నాల్కెలు నర్తించినా
ఎన్ని కర్ఫ్యూల
తెల్లసింహాలు నోట కరిచినా
ఎన్ని ప్రత్యామ్నాయ
నెత్తుటి ప్రవాహాలు ముంచెత్తినా
మూసీ నిలబడింది
మనిషిని నిలబెట్టింది
మణుల గర్భిణీ
మణీ ప్రవాళ సంస్కృతి నెగరేసింది
గంగాజమున తెహజీబై
తెలంగాణ పాడింది
మూసీ మనసు చదవక
కమలం బుల్డోజరు కళ్ళే
కాంగ్రేసు బుల్డోజరు కళ్ళైనాయి కానీ
మనిషిని మించిన మహా సౌందార్యాన్ని
మూసి కల కనలేదెప్పుడు
మనిషిని ద్వేషించని మనసే
మహా సౌందర్య మనుకుంది
మనిషి నవ్వు అలల్లో అల్లుకుంది
మనిషి ఆనందం
ప్రవాహం పాడుకొంది
మనిషి దుఃఖం ప్రవహించడం
తన మరణ మనుకుంది
ముచుకుందా!
హృదయం మూసుకున్నదెన్నడూలేదు
నగర ఆత్మై ప్రవహించింది
ఎప్పుడూ కోరికోరి
ఏ నీడనూ బలి కోరలేదు
తన అందాల కోసం
ప్రకృతి గుండెల్లో
గునపాలు దించమని అడుగలేదు
తనేమీ ప్రపంచ సుందరనుకోలేదు
లక్షలకోట్ల మేకప్పులతో
ఏ అందాల పోటీకీ సిద్ధపడలేదు
ప్రజల ఆశల్ని
పాలకుల ఇనప్పెట్టెల్లో
కాళేశ్వరమై కనకవర్షం
కురవాలను కోలేదు
పాలకుల మోచేయి నీళ్ళు తాగుతూ
ఏ వ్యాపార సామ్రాజ్యాల కోసమో
ఏ బలవంతులో
ఏ భూ వ్యాపారుల దగ్గరో
ఎలాస్టిక్ బఫర్‌జోన్ ముడుచుకుంటుంది
బతుకు వెతుక్కునే నీడల
నివాసానికీ ఉపాధికీ
గొలుసు తెంప వ్యాకోచిస్తుంది
నిర్వాసితులకు
నీడను కట్టించిన సబర్మతిని చూడవు కానీ.. సబర్మతి ఆశ్రమున్ని
చంద్రుని దాక నిర్మిస్తావా?
విగ్రహ రాజకీయం కొత్తా ఈ నేలకు!
ప్రక్షాళన చేయాల్సిన చోట
సుందరీకరణంటే
వేల ఎకరాల భూ భోగమే కదా!
థేమ్సు నది చిత్తశుద్ధి మనకెక్కడిది?
వలస వచ్చిన చెమట చుక్క
మూసీ డొక్క సేద దీరి
తరతరాలుగా
జంటనగరాల నాగరికతకు రాళ్ళెత్తింది
పాత నగరాన్ని కొత్తనగరాన్ని
కలిపి కుట్టిన
జీవధారం మూసీ నది!
బీడు భూములకు
పత్రహరితపు సొగసులద్ది
జలచర విన్యాసాలతో
పశుపక్ష్యాదుల కలకల
కిలకిల ధ్వనుల
సతత హర్షాల ఓర్చుకోలేక
కొండలు కోసుకోని
సిమెంటు కొండలు కట్టుకొని
గొలుసు కట్టు చెరువుల గొంతు కోసి
తాగునీటి స్వయంసంవృద్దికి ఉచ్చుపెట్టి
నగరం మట్టి కండరాల్లో
జలంబలం పారించే
కత్వాలకు పిండం పెట్టి
చిన్నపాటి వాననే
శవపేటికల నృత్యంగా మార్చి
మురుగునంతా
పునాది వర్గాల నెత్తికెత్తి
జీవనది చంపిన
పాలకుల చట్టబద్ద డంపుయార్డు పాపాన్నంతా
ఆకలి వర్గాల వెనుక దాచుకుంటారు
నాలుగు దశాబ్దాల
మురుగు రాజకీయం చేస్తూ
చెమట చుక్కల ఊపిరి చుట్టూ
ఉక్కు పాదాలు నాటడం కొత్తకాదు
మూసీ
మురికి కూపం కాదు
మనిషి కూపం
సమస్త జీవన రంగాల అలల
పునరుజ్జీవనానికి
పురిటిలోనే సంధి కొట్టిన
పాలకుల బ్రెయిన్ చైల్డు
డ్రైనేజీ చైల్డే!
నామమాత్ర నీడెప్పుడూ
యాభై కాలనీల చెమట గుహలు నమ్మవు కదా!
భద్రత కూల్చి భయాన్ని నిర్మించి
నార్సింగి నుంచి నాగోల్ దాకా
నమ్మకద్రోహాన్ని పెట్టుబడి పెట్టలేవు
చంద్ర మండలాన్ని కలగన్న
నందనవనం
మూసీ బచావో ఆందోళనలో కరగలేదా?
మూసీ స్కైవే పాతసార
మూతినాకి
సుందరీకరణ సూత్రం కనుగొని
నదికి లాభం లేని
ఏండ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడే
కాపులకు లాభం లేని
చెమట వాసనల మూసీ పరీవాహకాన్ని
వ్యాపార పరీవాహక కార్పోరేట్ కంపెనీల
కల కంటున్నారు
సరిహద్దులతో
గట్టు పంచాయతి లేని తల్లి!
నీళ్ళను చీల్చే రాళ్ళను
భరించే బహు దూరపు బాటసారి
పిల్లల్ని గుండెల్లోంచి తరుమాలని
కసరుకొంటుందా!
వడ్డెబోయిన శ్రీనివాస్

