తెలుగు ప్రభ ఉగాది ప్రత్యేక సంచిక ‘అనేక’లో సినిమాకు సంబంధించి తాడి ప్రకాష్, వంశీకృష్ణ వ్యాసాలు రాశా రు. తెలుగు సినిమాకు సంబంధించి 2014 తర్వాత రాసేటప్పుడు తెలుగు సినిమాకు, ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా కు తెలంగాణ ప్రాంతం చేసిన కంట్రిబ్యూషన్ను, హైదరాబాద్ తెలుగు సినిమాలో, భారతీయ సినిమాలో పోషించిన తనదైన పాత్రను అక్షరమాత్రంగానైనా ప్రస్తావించడం అవసరం. ప్రకాష్ తెలుగు సిని మా రంగంలో ఉన్నటువంటి డొల్ల తనాన్ని అశ్లీల దృశ్యాలతో మన దర్శక నిర్మాతలు వెండితెరను ఎలా పరిపుష్టం చేశారన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగానే చెప్పినప్పటికీ చాలా అంశాలు ఇంకా మిగిలి పోయే ఉన్నవనిపిస్తుంది.
అసలు తెలుగు సినిమాను ఎట్లా నిర్వచించుకోవాలి, తెలుగు నేల పై తయారైన సినిమానా? తెలుగు వాళ్ళు మద్రాసులో తీసిన తెలుగు సినిమాలా? లేకపోతే తెలుగు సినిమా రంగం హైదరాబాదుకు వచ్చిన తర్వాత తీసిన సినిమాల్ని తెలుగు సినిమా అనాలా? అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే 1953లో మద్రాసు స్టేట్ నుండి విడివడిన ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసులో ఉన్న తెలుగు సినిమా రంగం ప్రభుత్వంతో పాటు తెలుగు నేలకు తరలి రాలేదు. 1953 సెప్టెంబరు ఆంధ్ర వారపత్రికలో నండూరి రామ్మోహన రావు ‘తెలుగువారు మద్రాసు నుండి విడిపోయినా తెలుగు సినిమా రంగం మాత్రం మద్రాసు నుండి ఇప్పటికిప్పుడు విడిపోవడానికి ఎలాం టి కారణం కనిపించడం లేదు. తెలుగు సినిమా నటీనటులు ఇక్కడే స్థిరపడి ఉన్నారు. పైగా తెలుగువారు కొన్ని స్టూడియోలను కూడా నిర్మించి ఉన్నారు. కనుక మనం తెలుగునేలకు తగలవలసిన అవసరం లేద’ని ఖరాకండిగా రాసుకున్నారు. ఆ తర్వాత 1956లో ఆంధ్ర రా ష్ట్రం, హైదరాబాద్ స్టేట్‌లో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా మారిన తర్వాత కూ డా వారికి తెలుగు సినిమా రంగాన్ని తెలుగు నేలకు తరలిం చుకపోవా లన్న ఆలోచన రాలేదు. ఆ తర్వాత 1980 దాకా కూడా వాళ్లు తమిళ నేల మీదనే తెలుగు సినిమాలను ఉజ్వలంగా వర్ధిల్ల జేశా రు. ఇంతలో 60ల్లో తెలుగు వాళ్లకు గౌరవం లేదని మద్రాసుపై ఒక నింద మోపుతూ అక్కినేని హైదరాబాదుకు వచ్చి తన ప్రాపకంతో స్థలాలను తీసుకుని అన్నపూర్ణ స్టూడియో కట్టేశాడు. అంతవరకు 30 ఏళ్లపాటు తమిళులు గౌరవించనిదే మద్రాసులో ఎలా ఉన్నారని సాటి తెలుగువారు అక్కినేని పై ఆరోపణలు కూడా చేశారు. ఎన్టీ రామారావు మాత్రం మద్రాస్లోనే ఉండిపోయారు. ఎన్టీ రామారావుకు మద్రాస్ మీద ఎంత ప్రేమ ఉండే దంటే, ఆయన 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రైన ఆరు నెలల లోగానే తనకు తెర జీవితాన్ని, ఆ తర్వాత రాజకీ య జీవితాన్ని, అధికా రాన్ని ఇవ్వడానికి వేదికగా నిలిచిన మద్రాసుకు తాగడానికి మంచినీళ్లు ఇవ్వటానికి తెలుగుగంగ పథకాన్ని ప్రారంభిం చి కృష్ణానది జలాలను మహబూబ్‌నగర్ రైతుల భూములను ఎండబెట్టి మద్రాసుకు తరలించక పోతూ పోతూ రాయలసీమ, ఇతర ప్రాంతాల భూములకు నీళ్లు తీసు కుని వెళ్లిన మహానుభావుడు. ఆయన తెలుగు గంగ పథకమే ఇప్పుడు పోతిరెడ్డిపాడుగా పెద్ద పెద్ద షటర్లతో పదింతలై 10 ఫీట్ల కాలువ 100 ఫీట్లకు పెరిగి ఒక నదిని తరలించకపోయే ప్రాజెక్టుగా మారిపోయిం ది. ఇది పేదల కోసం రాజకీయ పార్టీ పెట్టిన రామారావు మా తెలం గాణ ప్రజల దుఃఖాన్ని, ఆర్తిని, కష్టాలను, కన్నీళ్లను, కరువును పారద్రో లుతాడని ఏకపక్షంగా అధికారం కట్టబెడితే పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టాడు. పైగా ఎన్టీ రామారావుకు మద్రాసు నుండి తెలుగు సిని మా హైదరాబాదుకు రావడం సుతరా మూ ఇష్టం లేదు. మళ్లీ 89లో చెన్నారెడ్డి వచ్చిన తర్వాతనే మద్రాసు నుండి తెలుగు సినిమా హైద రాబాదుకు తరలడం మొదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో పద్మాలయ, రామకృష్ణ, రామానాయుడు, రామోజీ ఫిలిం సిటీ వంటి స్టూడియోలు నెలకొన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
తాడి ప్రకాష్ చెప్పినట్లుగా తెలుగు సినిమా రంగంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, జయలలిత, సిల్క్‍స్మిత, ఆ తర్వాత కాలంలో వచ్చిన ముమైత్ ఖాన్లు లేకపోతే చాలామంది సినిమా నిర్మాతలు రెండో సిని మా తీసే వాళ్ళు కారు. ఇంకా చెప్పాలంటే శృంగార తారల తొడ తొక్కి డితోనే తెలుగు సినిమా రంగం సెక్సును సెన్సార్ ఆమోదంతో తెలుగు ప్రేక్షకులకు పలహారంలా పంచి పెట్టింది.
తెలుగు సినిమా రంగం టాకీల తొలి పాతికేళ్ల కాలంలో రాయల సీమ దర్శకనిర్మాతలు బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, మూలా నారాయణ స్వామి, బి.నాగిరెడ్డి వంటివారి చేతుల్లో ఉన్నంతకాలం సినిమా హీరో యిన్ పైట చెరిగిపోలేదు. 1960లో వచ్చిన ఆంధ్ర ప్రాంతపు దర్శక నిర్మాతల పుణ్యంగా తెలుగు సినిమా హీరోయినుకు వ్యాంపుకు మధ్య న ఉన్న సరిహద్దు రేఖ క్రమంగా కరిగిపోయింది. ఇక 70లో రాఘవేం ద్ర రావు ప్రవేశం తర్వాత సినిమాలలో స్త్రీల అవయవాల పట్ల ఉన్న గోప్యత అంతా కూడా గుప్పిట్లోంచి బయటపడి బహిర్గతమైంది.
నిజానికి మనవాళ్లు సినిమాను ఎంతగా వ్యాపారమయం చేశా రంటే భానుమతి వంటి మహానటి కూడా ‘చింతామణి’ సినిమాను నిర్మిస్తుంది. చింతామణిగా నటిస్తుంది కూడా. ఆమె నటించింది కనుక అది కళాఖండం అయింది. తెలివిపరుడైన నాగేశ్వరరావు అందులో నటించకుండా జాగ్రత్తపడ్డాడు. బి.యన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి, కమలా కర వంటి వాళ్లు తీసిన చిత్రాలు మాత్రమే మనకు నేటికీ గొప్పగా కని పిస్తాయి. ఆ తర్వాత తెలుగు సినీ గంజాయి వనంలో తులసి మొక్కలా కె. విశ్వనాథ్ మాత్రం తన ధోరణిని విస్మరించలేదు. భక్తి చిత్రాల గురించి ప్రకాష్ ఏ అభిప్రాయంతో రాశారో కానీ, తెలుగు సినిమాలలో వచ్చిన లవకుశ, మాయాబజార్, వీరాభిమన్యు, సీతారా మ కళ్యాణం, శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణ తులాభారం వంటి పౌరాణిక చిత్రాల వలన ప్రజలు చెడిపోలేదు సరికదా, కాస్త నైతిక విలువలను నేర్చుకున్నారు. ఇవి కాకుండా మనవాళ్ళు తీసిన సినిమాలన్నీ కూడా నిర్మాతల గల్లా సంచిలో చేరిన రూకలే. ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా చెప్పుకొనబడే రామోజీ కూడా ఒకటి రెండు తప్పిస్తే గొప్ప సినిమాలు ఏవీ తీయకపో వడం విషాదకరం. పై అంశాలన్నీ మనకేమి రుజువు పరుస్తాయంటే, తెలుగు సినిమా 1922 నుండి, కాకపోతే 1910 నుండీ ఇప్పటివరకు కూడా తెలుగు నేలపై లేనే లేదు. 1989- 90 వరకు మద్రాసులో 80 ఏళ్ళు తెలుగు సినిమా అరవ నేలపై దేదీప్యమా నంగా వెలుగొందింది. ఆ తర్వాత తెలంగాణలో గడిచిన 30 ఏళ్లుగా కొలువై ఉన్నది. తెలుగు సినిమా అన్నది తెలుగు నేలపై అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రాంతంలో ఉండాలి కదా? అలాంటప్పుడు వీళ్లను మద్రాసు సినిమా రంగంలో అంతర్భాగంగానో, హైదరాబాద్ సినిమా రంగంలో అంత ర్భాగంగానో చెప్పుకోవాలి తప్ప, విడిగా తెలుగు సినిమా అని చెప్పుకోవ డానికి ఎట్లా చారిత్రకంగా ఆధారాలు చూపుతారో చెప్పాలి. తమది కాని అరవ నేలపై, ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ లో తన జీవికను సాగించిన తెలుగు సినిమాను ఎట్లా అర్థం చేసుకోవాలి? పైగా వీళ్లు మద్రాసులో ఉన్నంతకాలం చక్కగా తమిళ భాష నేర్చుకొని ఆ భాషలో నే తమ ఉనికిని అక్కడ నిలుపుకోగలి గారు. కానీ హైదరాబాద్ స్టేట్‌కు వచ్చిన తర్వాత వాళ్ళు తెలంగాణ భాషను మొరటు భాషగా అవమా నించి తమ ప్రాంతం తెలుగు భాషను తెలంగాణపై బలవంతంగా (పత్రికలు పాఠ్యపుస్తకాలు, సాహిత్యం రూపంలోనూ) రుద్దిన చరిత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్రను పోషించింది.
ఇక తెలుగు సినిమా వైభవం అన్న మాటలోనే అతిశయోక్తి కనిపి స్తుంది. గడిచిన 90 ఏళ్లుగా మలయాళ సినిమాతో తెలుగు సినిమాను సరిపోల్చదగిన సందర్భమే రాలేదు. మలయాళీలు సైలెంట్ సినిమాల కాలం నుండి ఆధునిక పోకడలు అనుసరించిన విషయం ఇక్కడ గమ నార్హం. తెలుగు సినిమా అని రాయడంలోనే వంశీకృష్ణ ఇంకా తెలంగా ణను ఆవాహన చేసుకోలేదనిపిస్తుంది. వారి వ్యాసంలో ఎక్కడా కూడా తెలంగాణ సినిమా గురించిన ప్రస్తావన లేదు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ సినిమాలు ఉన్నవి. తెలంగాణ సినిమాకు చరిత్ర ఉంది. తెలంగాణ సినిమా పరిశ్రమ లేదు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన సినిమా జర్నలిస్టులు, పరిశోధకులు రాయవలసిన విషయాలు రాయకుండా ఇంకా తెలుగు సినిమా వైభవ ప్రభావాల గురించి రాసుకుంటున్నారు. తెలుగు సినిమా విమర్శను చరిత్రను ఒకే గాటన కట్టేస్తున్నారని, ఇవి రెండూ వేరువేరని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నూతన చరిత్రలో విమర్శ లేకుండా ఎక్కడా ఉండదు. నూతన చరిత్ర అన్నది విమర్శకులతో కూడే రూపొం దుతుంది. ఇది తెలియకుండా కొందరు తమ అక్కసును, మేధావిత్వా న్ని ప్రదర్శిస్తూ అందంగా బయటికి వెళ్లగక్కుతున్నారు.
1956లో జాతీయ సినిమా అవార్డులు ప్రారంభమైతే ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుకు పథేర్ పాంచాలితో పోటీ పడిన సిని మా బి.ఎన్.రెడ్డి బంగారు పాప. ఆనాటి ఉత్తరాది వారి ఆధిపత్యం వల న బంగారు పాపకు రావలసిన మొదటి స్థానం చేజారి రెండవ స్థానం తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తర్వాత 60 ఏళ్లకు బాహుబ లికి అవార్డు వచ్చేదాకా మనం జాతీయస్థాయి ఉత్తమ సినిమా అవార్డు కు ఎంతదూరంలో ఉన్నామో అర్థమవుతుంది. పైగా బాహుబలి ఉత్తమ కథా పరమైన విలువల్ని కలిగి ఉన్న సినిమా కాదు. అది ఫక్తు గ్రాఫిక్స్ తో కూడిన ఒక ఊహాజనితమైన కథ. వాస్తవిక జీవితాన్ని ప్రతిబింబిం చని సినిమా. ఇలాంటి బాహుబలికి అవార్డు రావడం వెనుక జరిగిన తతంగం ఎంత ఉందో చాలామందికి తెలియకపోవచ్చు. ఒక వ్యాపార సినిమాకు అవార్డు రావడంలోనే జరిగిన లాబీయింగ్ ఏ పాటితో మన కు చెప్పకపోయినా తెలిసిపోతుంది. అదే సంవత్సరం వచ్చిన ‘కంచె’, బాహుబలి కన్నా 100 రెట్లు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సినిమా గా విమర్శకులు ప్రశంసించారు. మాభూమి, దాసి, మట్టి మనుషులు లాంటి సినిమాలు తీసిన బి.నర్సింగరావు తెలుగు సినిమా వైభవానికి చేసిన కృషి ఇక్కడ విస్మరించినట్టుగా కనిపిస్తుంది. సామాజి క బాధ్యత ను మరచిన ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి, పుష్ప వంటి సినిమాలే తెలుగు సినిమా వైభవానికి ప్రతీకలైతే ఇంక ఇక్కడ చెప్పవలసింది ఏమీ లేదు. చిత్తూరు నాగయ్య చనిపోయినప్పుడే అనుకుంటాను మహాదర్శ కుడు బి.ఎన్.రెడ్డి ‘తెలుగు సినిమా రంగం రకరకాల పిచ్చి ముక్కలతో పెడధో రణులతో అల్లుకుపోయి ఉందని’ అన్న మాటలు తెలుగు సినిమా వైభవాన్ని ఎట్లా నిర్వచిస్తాయి? మిగతాది వచ్చేవారం …
హెచ్. రమేష్ బాబు
గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత

