Homeఅనేక / సాహిత్యంIdeal King of Rama: సుపరిపాలన అంటే...?

Ideal King of Rama: సుపరిపాలన అంటే…?

Ideal King of Rama: “” సర్వే జనాః సుఖినో భవంతు..” అనే మాటలో అందరూ క్షేమంగా ఉండాలి. తాను జీవించాలి. ఇతరులను జీవింపజేయాలని సార్వకాలిక సత్యమైన ధర్మము దాగి ఉంది. “ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది” అని శ్రీమద్రామాయణం చెబుతుంది. ఒకసారి అంగ రాజ్యంలో రోమపాదుడు ధర్మాన్ని తప్పినందున అక్కడ దారుణమైన కరువు, అనావృష్టి ఏర్పడింది. పాలకులు వీటిని దృష్టిలో ఉంచుకొని పరిపాలనా కార్యాలలో చేసే అపచారాలకు అధర్మాలకు రాజే బాధ్యుడు అవుతాడు.

- Advertisement -

రోమపాదుని వల్ల వచ్చిన కష్టాలను పోగొట్టడానికి ఆ దేశాధిపతియైన దశరథుడు ఋష్య శృంగుని తన రాజ్యానికి ఆహ్వానించి, యజ్ఞ యాగాలు నిర్వహించాడు. ఆ మహానుభావుడు అడుగుపెట్టిన నాటి నుండే వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి. ప్రజలు సంతోషించారు. ఈ కాలంలో అయితే ఋష్య శృంగుని లాంటి మహానుభావులు లేరు. కానీ రోమపాదుని వంటి నాయకులు మాత్రం ఎక్కువయ్యారని చెప్పవచ్చు. అందుకే ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సిన రోజులివి. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానంగా సుఖ సంతోషాలతో జీవించే ప్రాథమిక హక్కులకు భంగం కలగని పాలనతో సుపరిపాలనను అందించాలని ధర్మశాస్త్రాలతో బాటు రాజ్యాంగం కూడా చెబుతుంది. “”

శాంతి భద్రతలతో పాలన సాగాలి
ప్రజలకు మంచి పాలన మంచి పాలకుని వల్ల ధర్మము చేత రంజింపజేసే పాలన అవసరం. ఏ దేశానికైనా ఇది వర్తిస్తుంది. రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు, ప్రజల అవసరాలు, మౌలిక సమస్యల పరిష్కారము జరగాలి. రాజ్యంలో లేదా దేశంలో మంత్రులు త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. అపరాధం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టరాదు. అబద్ధాలు ఆడేవారు గ్రామాల్లో గాని, రాష్ట్రాల్లో గాని లేరని శ్రీమద్రామాయణంలో అయోధ్యా నగర వర్ణన సమయంలో వాల్మీకి తెలిపినట్లు, ప్రతి గ్రామంలో, నగరంలో, రాష్ట్రంలో వంచకులు, మోసగాళ్లు లేని పరిపాలన కావాలి. అప్పుడే దేశమంతటా శాంతి సుస్థిరంగా నెలకొంటుంది. శాంతి భద్రతలతో కూడిన పాలన ప్రజలకు అందుతుంది. ఒకవేళ పక్క రాజ్యాలతో గనుక స్వల్ప విభేదాలు ఏర్పడితే సంధి చేసుకోవడం తప్ప మరొక మార్గం ఉండదు. అవే కనక దీర్ఘకాలికమైన సమస్యలు ఉత్పన్నమైతే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది రాజనీతి శాస్త్రం చెప్పిన విషయం. అందుకే పాలకులు సాధ్యమైనంత వరకు పక్క రాజ్యాలతో, పక్క దేశాలతో సామరస్య పూర్వకంగా సాగడమే మంచిదనే రీతిలోనే పాలన సాగాలి.

రామాయణం నిర్దేశించిన సుపరిపాలనా రీతి
మంచి పరిపాలన ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది శ్రీమద్ రామాయణం. పౌరాణికం కంటే చారిత్రక ఆధారాలను అందిస్తుంది ఈ కావ్యం. మంత్రులు విదేశీ వ్యవహారాలను సరిహద్దు సమస్యలను సున్నితమైన తగాదాలను పరిష్కరించడంలో మిక్కిలి విజ్ఞతను చూపించే వారట! రాజకీయాలలో మిత్రభేదం, మిత్ర లాభాలు ఉంటాయి. అలాగే సంధి ఒప్పందాలు, విభేదాలు తెలుసుకొని ఉండే మంత్రుల వల్ల దేశం క్షేమంగా సుభిక్షంగా ఉంటుంది. సూక్ష్మ బుద్ధి గల మంత్రులు, నీతి శాస్త్రము తెలిసిన మంత్రులు, దండనీతిని పాటించే మంత్రులే రాజ్యానికి అవసరమని శ్రీమద్రామాయణ మహాకావ్యం వివరిస్తుంది.

పాలకులు ధర్మం తప్పితే రాజ్యంలో సంక్షోభం తప్పదు
రాజ్యంలో జరిగే మంచి చెడు పరిణామాలను ఎప్పటికప్పుడు గూడచారుల వలన సమాచారం సేకరించాలి. రాజ్యం మీద కన్ను వేసే పక్క రాజ్యాలను, సామంత రాజుల కదలికలను కనిపెట్టాలి. సుంకం చెల్లించని ప్రజల నుండి అపరాధ రుసుం వసూలు చేయాలి. పాడిపంటలకు ఇతోధిక ప్రోత్సాహం కలిగించాలి. అక్కడి సైనికులు పోరాట పటిమ గల వారే కానీ అనవసరంగా ఆయుధాలు ప్రయోగించడం గాని, నిరాయుధలను ఒంటరిగా ఉన్నవారిని చంపరు. శబ్ద భేది వంటి ధనుర్ విద్యా విశారదులు అక్కడి యోధులు. ధన ధాన్యములు గల రాజ్యం. అక్కడి ప్రజలకు కరువు కాటకాలు తెలియవు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ధర్మం తప్పితే రాజ్యం సంక్షోభంలో పడుతుంది. ఒకసారి రోమపాదుడనే వాడు ధర్మాన్ని తప్పినందువల్ల దారుణమైన కరువు, అనావృష్టి, పంచభూతాల వల్ల భయం అంగ రాజ్యంలో కలిగాయి. ఆ దేశ పాలకుడైన దశరథ మహారాజు వీటిని దృష్టిలో ఉంచుకొని పరిపాలన కార్యాలలో చేసే అపచారాలకు అధర్మాలకు రాజే బాధ్యుడు అవుతాడు. కనుక దశరథ మహారాజు అనావృష్టి నివారణ చర్యలను చేపట్టాడు. అని రామాయణం తెలియజేస్తుంది.

ధర్మం, న్యాయం, శాంతి ఉన్నచోటే సుపరిపాలన సాధ్యం
అసమర్థుడైన రోమపాదుని వల్ల కలిగిన కష్టాలను పోగొట్టడానికి దశరధుడు తన రాజ్యానికి ఆహ్వానించి యజ్ఞ యాగాలు నిర్వహించాడు. ఆ మహానుభావుడు అడుగుపెట్టిన నాటి నుండే వర్షాలు కురవసాగాయి. పంటలు బాగా పండాయి. ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందించారు. ఈ కాలంలో అయితే ఋష్యశృంగుని లాంటి ప్రజాసేవా పరాయణులు తక్కువే. కానీ రోమపాదుని వంటి నాయకులు కోకొల్లలు. అందుకే ప్రజలే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన రోజులివి. రాజ్యాంగం ప్రకారం అందరి హక్కులను సమానంగా అందరినీ సంతోషంగా పరిపాలించగలిగే ప్రాథమిక హక్కులను భంగం కలగకుండా పరిపాలనా రీతిని పాటించాలని శాస్త్రాలు, రాజ్యాంగము చెబుతున్నాయి. “సర్వే జనాః సుఖినోభవంతు” అనే వేదవాక్కును నాయకులు దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమానికై అహర్నిశలు పాటుపడాలి. ఎక్కడైతే ధర్మం, శాంతి, న్యాయం కొలువై ఉంటాయో అక్కడ సుపరిపాలన ఉంటుంది. దీనికి ప్రత్యక్ష చారిత్రక సాక్ష్యం శ్రీమద్రామాయణ మహాకావ్యం లోని రామరాజ్య స్థాపన. అందుకే రామాయణం లోకాభిరామాయణం అయింది.

“సాహిత్య కళా విభూషణ్” చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News