చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్ టియాన్‌షాన్ జిల్లా ఉరుంకిలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారని చైనా మీడియా ప్రకటించింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 9 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
15వ అంతస్తులో నుండి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అవి క్రమంగా 17వ అంతస్తు వరకూ వ్యాపించాయి. దాంతో 21వ అంతస్తు వరకు పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు 3 గంటల సమయం పట్టింది. చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. జీరోకోవిడ్ ఆంక్షల కారణంగా ఆ అపార్ట్ మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న డోర్ కు అధికారులు తాళం వేయడంతో అపార్ట్ మెంట్ వాసులు బయటికి రాలేకపోయారు. నివాసితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మొదటి, రెండవ అంతస్తుల నుండి దూకారు. చనిపోయిన 10 మంది తప్పించుకునే అవకాశం లేకే మృతి చెందినట్లు చైనాకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.