ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ (Jhansi) లోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కాలేజ్ లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో పదిమంది శిశువులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు ఉండగా… మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరుగులెత్తారు. దీంతో 37 మంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. హాస్పిటల్లో ఉన్న బాలింతలను, గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు.
శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంటెన్సివ్ కేర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది, భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పరుగులు పెట్టారు. దీంతో ఆసుపత్రిలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ఝాన్సీ (Jhansi) జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ మీడియాకి వివరించారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అంతా ఆసుపత్రికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంది. అగ్నిప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీ కి బయలుదేరి వెళ్లి, సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.