Aam Aadmi Party: ఇటీవలి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ కౌన్సిలర్లను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపించింది. పలువురు ఆప్ కౌన్సిలర్లతో కలిసి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీపై ఆరోపణలు చేశారు. ‘‘బీజేపీ నీచ రాజకీయాలు ప్రారంభించింది. మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొన్నట్లుగా కౌన్సిలర్లను కొనేందుకు ప్రయత్నించింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రయత్నించింది. ప్రజాతీర్పును డబ్బుతో కొనాలని చూసింది. ఆప్ కంటే 30 సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ బీజేపీ ఢిల్లీ మేయర్ స్థానం తమదే అని సిగ్గులేకుండా చెప్పుకుంటోంది. పది మంది ఆప్ కౌన్సిలర్లను కొనేందుకు బీజేపీ రూ.100 కోట్లు వెచ్చించాలనుకుంటోంది” అని సంజయ్ ఆరోపించారు.
ఆప్ కౌన్సిలర్లు మాట్లాడుతూ తమ అనుచరులను బీజేపీ వేధిస్తోందన్నారు. తమ కార్యకర్తలకు చెందిన ఇండ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని చెప్పారు. మేయర్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే రూ.50 లక్షలు ఇస్తామని కొందరు ఆఫర్ చేశారని ఆప్ కౌన్సిలర్లు ఆరోపించారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ కూడా అదే ఆరోపణలు చేసింది. బీజేపీ కౌన్సిలర్లను ఆప్ తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ ఆరోపణలు ఏ దిశగా సాగుతాయో చూడాలి.