Friday, September 20, 2024
Homeనేషనల్1000 still missing in Wayanad landslide tragedy: ఇంతకీ ఆ 1000 మంది...

1000 still missing in Wayanad landslide tragedy: ఇంతకీ ఆ 1000 మంది ఏమ‌య్యారు?

కేరళలో భారీ వర్షాలతో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన ఘ‌ట‌న‌లో గ్రామాలకు గ్రామాలే క‌నుమరుగ‌య్యాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 320 మందికి పైగా చ‌నిపోగా… 200 మందికి పైగా గాయపడ్డారు. సైన్యం సుమారు 1,000 మందికి పైగా రక్షించ‌గా… మ‌రో 220 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మ‌రో ప‌క్క వయనాడ్‌లోని చూరాల్‌మలైలో 1000 మంది అసలు ఎక్కడున్నారో తెలియదని అక్కడున్న రెస్క్యూ సిబ్బంది చెప్ప‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొత్తం 3000 మందిలో దాదాపు 1000 మంది మాత్రమే తప్పించుకున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2400 మంది . పిల్లలు అందరు కలిపి దాదాపు 3000 మంది ఉన్నారు. మిగ‌తా వాళ్లు అసలు బ్రతికే ఉన్నారా? లేదా అనేది తెలిడం లేదు… అని వారు వివ‌రించారు. శిథిలాల కింద ఉన్న శవాలను వెలికితీస్తున్నామని.. మృత‌దేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆర్మీ సహా రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్‌ ఆధారిత రాడార్‌ ను ఉపయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం నిరంతరం అన్వేషణ చేస్తూనే ఉన్నారు. 40 బృందాలు చూరల్‌మల ప్రాంతాన్ని ఆరు జోన్‌లుగా విభజించి గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించాయి. చలియార్ నది (వయనాడ్ కొండచరియలు విరిగిపడటం)కి 40 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 8 పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ప్రతి బృందంలో ముగ్గురు స్థానికులు, ఒక అటవీ శాఖ ఉద్యోగి ఉన్నారు. కోస్ట్ గార్డ్, ఫారెస్ట్ , నేవీ బృందాలు కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. పోలీసులు, వాలంటీర్లు కూడా బాధితుల కోసం చలియార్ ఒడ్డున కూడా వెదుకుతున్నారు. చూరల్‌మల దగ్గర జ‌ర‌గుతున్న గాలింపుల్లో పడవెట్టికున్నులోని ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయాలతో సజీవంగా కనిపించారు. ఇద్దరు పురుషులు, ఒక మహిళతో పాటు ఒక యువతి ఉందని .. యువతి కాలికి గాయమైందని సైన్యం వెల్లడించింది. వైద్యసేవల నిమిత్తం ఈ బాధిత కుటుంబాన్ని విమానంలో ఆస్పత్రికి తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

డ్రోన్, రాడార్​తో గాలింపు

మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేసింది. దీనితో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ వంతెన‌ మీదుగా ఎక్స్‌కవేటర్‌లతో సహా భారీ యంత్రాలను, అంబులెన్స్‌లను కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుందని తెలిపారు మట్టిదిబ్బల్లో ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు దిల్లీ నుంచి డ్రోన్ ఆధారిత రాడార్​ను శనివారం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి కె రాజన్ తెలిపారు. ప్రస్తుతం ఆరు పోలీసు శునకాలు సెర్చ్ ఆపరేషన్​లో ఉన్నాయని, మరో నాలుగింటిని తమిళనాడు నుంచి వయనాడుకు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 279 శవపరీక్షలు పూర్తి చేసినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి. ఈ ఘటనలో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కేరళ భారీ వర్షాలకు సంబంధించి సాధారణ హెచ్చరికలను ముందుగానే జారీ చేశామని భారత వాతావరణశాఖ (ఐఎండీ) చీఫ్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. జులై 30వ తేదీ ఉదయమే రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేశామని పేర్కొన్నారు. అదే రోజు తెల్లవారుజామునే కొండచరియలు విరిగిపడ్డాయి.
వయనాడ్ ప్రమాద మృతులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు. జిల్‌ బైడెన్‌తోపాటు తాను మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు తమ అండ ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News