భార్యభర్తల మధ్య వయసు పెరుగుతున్నా అనుబంధం మాత్రం మరింత బలపడుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 108 ఏళ్ల కరియప్ప, 98 ఏళ్ల గోపమ్మ దంపతులు తమ 60వ వివాహ వార్షికోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు, గ్రామస్థులు సహా పెద్ద సంఖ్యలో బంధువులు ఈ ప్రత్యేక వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక ప్రత్యేకత ఏమిటంటే, పాతకాలపు సంప్రదాయాలను పాటిస్తూ, ఆచారబద్ధంగా ఈ జంట మరోసారి వివాహం చేసుకుంది. పెళ్లి ఎలా జరగాలో అలాగే తాళి కట్టడం, అరుంధతి నక్షత్ర దర్శనం, గాజుల సమర్పణ వంటి ఆచారాలు అన్ని పాటించారు. గతాన్ని తలచుకుంటూ, తమ జీవిత ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మలుచుకున్నారు.
కరియప్ప, గోపమ్మ దంపతుల ఆరోగ్యం, బలం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. 108 ఏళ్ల వయస్సులో కూడా కరియప్ప పైల్వాన్ మాదిరిగా బలంగా ఉంటుండటం విశేషం. వారి ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోవాలని యువత సైతం ఆసక్తి చూపింది. నేటి తరం చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో, ఈ వృద్ధ దంపతుల ఉల్లాసంగా ఉండటం అందరికీ స్పూర్తిగా నిలిచింది.
ఈ వేడుకకు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కరియప్ప, గోపమ్మ దంపతులకు మొత్తం 40 మంది కుటుంబ సభ్యులు.. పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు ఉన్నారు. కుటుంబ సమేతంగా జరుపుకున్న ఈ 60వ వివాహ వార్షికోత్సవం అందరికీ చిరస్మరణంగా నిలిచింది. ఈ వృద్ధ దంపతుల పెళ్లి వేడుకను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొంతమందికి ఆహ్వానం అందకపోయినా, ఈ అరుదైన సంఘటనను వీక్షించేందుకు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ వేడుక గ్రామంలోని అందరికీ ఒక గొప్ప అనుభూతిగా మిగిలింది. ఈ సుదీర్ఘ అనుబంధం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 60 ఏళ్ల వివాహ బంధాన్ని ఈ విధంగా జరుపుకోవడం ఒక అపురూప సంఘటనగా మారింది.