Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం క్లౌడ్ బర్స్ట్ చోటుచేసుకుంది. ఈ క్లౌడ్ బరస్ట్ ఘోర విపత్తుకు కారణమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సంఘటనలో 12 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, పలువురు గల్లంతయ్యారు.
చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి భక్తులు వెళ్తుంటారు. ఈరోజు జరిగిన క్లౌడ్ బర్స్ట్ చషోటీ ప్రాంతంలో.. మచైల్ మాతా యాత్ర ఉత్సవాలకు వెళ్లే మార్గంలో చోటు చేసుకుంది. ఈ యాత్రలో భాగంగా చషోటీ ప్రాంతంలో భక్తులు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో వర్షపాతం ఏర్పడి, క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరద ఉధృతి పెరిగింది. ఇదంతా క్షణకాలంలో సంభవించడంతో భక్తుల తాత్కాలిక నివాసాలు పూర్తిగా కొట్టుకుపోయాయి.
ఈ సంఘటన సంభవించిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షిస్తూ.. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు ధృవీకరించారు. కిష్త్వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామస్తులతో పాటు భక్తులను వరద ప్రభావిత ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డా.జితేంద్ర్ సింగ్ తదితరులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయం, హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించి, పూర్తి సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన దృష్ట్యా మచైల్ మాతా యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. భక్తుల భద్రత దృష్ట్యా, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్ర పునఃప్రారంభం ఉండదని అధికారులు తెలిపారు.
Read more: https://teluguprabha.net/national-news/himachal-pradesh-death-toll-due-to-rains-rises-to-241/
ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో ఈ తరహా క్లౌడ్ బర్స్ట్ లు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అనియంత్రిత యాత్రల అభివృద్ధి లాంటి అంశాలు ఈ పరిణామాలకు కారణమవుతున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


