Special Trains For Diwali: దీపావళి పర్వదినం, ఛఠ్ పూజ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. పండుగ రద్దీని తగ్గించేందుకు 12,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోమవారం గుజరాత్‌లోని వల్సాడ్‌లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఈ మేరకు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాకులతో పాటు సుమారు 60,000 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్‌ను విద్యుదీకరించాం. ప్రస్తుతం 150 వందే భారత్, 30 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందిస్తున్నాయి. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 110 స్టేషన్లను ప్రారంభించాం. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి.’ అని వివరించారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన మార్గాల్లో వేగంగా ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే 1,200 లోకోమోటివ్‌లలో ఈ వ్యవస్థను అమర్చామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి ఏటా 7,000 కొత్త కోచ్‌లను తయారు చేస్తున్నామని తెలిపిన ఆయన.. ఇందులో భాగంగా 3,500 జనరల్ కోచ్‌లను అదనంగా చేర్చామని వెల్లడించారు.


