Phones and Ganja Packets seized in Karnataka Jails: కర్ణాటకలో ఇక జైళ్లలో కరుడుగట్టిన ఖైదీల ఆటలు ఇక సాగవు. నూతన అధికారి రాక నేపథ్యంలో ఖైదీల గుండెల్లో వణుకు పుడుతుందనే చెప్పవచ్చు. కొత్త చీఫ్‌గా అధికారం చేపట్టిన 72 గంటల్లోనే జైళ్లలో ఫోన్లు, గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఖైదీల రాజభోగాల వీడియోలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రేప్, మర్డర్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు.. ఊచలు లెక్కపెట్టకుండా దర్జాగా ఫోన్లు మాట్లాడుతూ, టీవీలు చూస్తూ వీఐపీ ట్రీట్‌మెంట్ అనుభవిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 11న కర్ణాటక జైళ్లు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక వచ్చీ రాగానే జైళ్లపై దాడులు ప్రారంభించారు.
Also Read: https://teluguprabha.net/national-news/india-rejects-bangladesh-allegations-supports-fair-elections/
కొత్త చీఫ్‌గా అలోక్ కుమార్ బాధ్యతలు చేపట్టాక.. రాష్ట్రంలోని పలు జైళ్లలో ఆకస్మిక తనిఖీలకు ఆదేశించారు. కేవలం 72 గంటల్లోనే 13 ఫోన్లు, ఆరు గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైళ్లలో జరిగే అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తాజా దాడుల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రధానంగా బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీలకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు మొదటగా అక్కడ తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/national-energy-conservation-day-save-energy-future/
కార్వార్ జిల్లా జైలులో తనిఖీల్లో ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా స్థాయి జైళ్లలో తీవ్రమైన భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఆ జైలులో ఇటీవల జరిగిన ఘర్షణమ నేపథ్యంలో నలుగురు ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జైళ్లకు తరలించారు. జైళ్లలో శాంతిని పునరుద్ధరించడం, ముఠా ప్రభావాన్ని తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
ఇక మైసూరు సెంట్రల్ జైలులో మాదకద్రవ్యాల సరఫరా కొనసాగుతుందనే సమాచారం మేరకు అక్కడ పోలీసులు తనిఖీలు చేశారు. భద్రతా సిబ్బంది ఆరు ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

