Air India: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా వరుస ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రయాణికులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే సీనియర్ సిటిజన్లకు టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించిన ఎయిరిండియా.. ఇప్పుడు బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఇది వర్తించనుంది. ఈ ఆఫర్‌తో తక్కువ ధరకే విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నామని సంస్థ వెల్లడించింది.
Read Also: Bronco Test: టీమిండియా ప్లేయర్లకు గుడ్ న్యూస్.. బ్రాంకో టెస్టు నుంచి ఊరట
ఎయిరిండియా కొత్త ఆఫర్
దక్షిణాసియా, పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వారి కోసమే ప్రత్యేకంగా ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఇందులో ప్రీమియం ఎకానమీ రౌండ్ ట్రిప్ ధర రూ.13,300 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్లు రూ.34,400 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో బుక్ చేసుకునే వారికి అదనపు రాయితీలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. FLYAI అనే ప్రోమో కోడ్ ఉపయోగించి ప్రతి టికెట్‌పై రూ.2,400 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. వీసా కార్డుతో బుకింగ్ చేస్తే VISAFLY కోడ్ ద్వారా రూ.2,500 వరకు రాయితీ లభిస్తుంది. ఇకపోతే, ఇది పరిమితకాల ఆఫర్. సెప్టెంబర్ 2 నుంచి 7 తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. 2026 మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎయిరిండియా వెబ్‌సైట్, యాప్, ఎయిర్‌పోర్ట్ టికెటింగ్ ఆఫీసులు, కస్టమర్ సర్వీస్ కేంద్రాలతో పాటు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఆఫర్ చివరి రోజు (సెప్టెంబర్ 7న) మాత్రం కేవలం ఎయిరిండియా వెబ్‌సైట్, యాప్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యమవుతాయి. మొదట బుక్ చేసుకునే వారికి మొదట ప్రాధాన్యం ఉంటుంది. ఎక్స్ఛేంజ్ రేట్లు, ట్యాక్స్‌ల కారణంగా నగరాల్లో ఛార్జీలు స్వల్ప తేడాతో ఉండొచ్చు. కాబట్టి ఉత్తమ ప్రయోజనాల కోసం ముందుగానే బుక్ చేసుకోవడం మంచిదని ఎయిరిండియా కస్టమర్లకు సూచించింది.
Read Also: Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట.. 91 రోజుల తర్వాత స్పందించిన కోహ్లీ
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్
ఎయిరిండియా సీనియర్ సిటిజెన్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. 60ఏళ్లు, ఆపైబడిన ప్రయాణికులకు రాయితీలు ప్రకటించింది. వారు చేసే దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఈ రాయితీలు వర్తిస్తాయని వెల్లడించింది. తమ కొత్త స్కీమ్ కింద టికెట్ బేస్ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తామని ఎయిరిండియా (Air India) వెల్లడించింది. ఎకానమీ నుంచి ఫస్ట్‌క్లాస్ వరకు అన్ని క్యాబిన్లకు ఇది వర్తిస్తుంది. ఒకసారికి ప్రయాణ తేదీని మార్చుకోవడానికి వీలుంది. అయితే అప్పుడు ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటే చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రయాణికుడు 10కేజీలు అదనంగా లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. లేకపోతే.. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేవారు 23 కేజీల బరువున్న రెండు లగేజీలను తీసుకెళ్లొచ్చు. అదే సమయంలో బిజినెస్ క్లాస్‌లో వెళ్లేవారు 32 కేజీల బరువున్న రెండు లగేజీలను వెంట తీసుకెళ్లొచ్చు.


