170 hours continuous Bharatanatyam performance : ఏడు రోజులు… 170 గంటల నిర్విరామ నాట్య యజ్ఞం! ఇది కల కాదు, కఠోర శ్రమతో సాధించిన అద్భుతం. మంగళూరుకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని భరతనాట్యంతో ప్రపంచ రికార్డుల పుటల్లో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకుంది. ఇంతటి అసామాన్య ప్రదర్శన వెనుక ఉన్న స్ఫూర్తి ఏంటి..? ఈ ఘనతను సాధించడానికి ఆమె చేసిన సాధన ఎలాంటిది..? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అలుపెరగని నాట్యంతో అద్వితీయ విజయం : పట్టుదల ఉంటే అసాధ్యమన్నది లేదని నిరూపించింది మంగళూరుకు చెందిన డిగ్రీ విద్యార్థిని రెమోనా ఎవీట్ పెరీరా. ఏకంగా 170 గంటల పాటు నిర్విరామంగా భరతనాట్యం ప్రదర్శించి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది. భారతీయ సంస్కృతీ వైభవానికి ప్రతీకగా నిలిచే భరతనాట్యంతో ఆమె సృష్టించిన ఈ రికార్డు, ఆమె అకుంఠిత దీక్షకు, అచంచలమైన గురుభక్తికి నిలువుటద్దం పడుతోంది.
రికార్డు ప్రస్థానం సాగిందిలా..
ప్రారంభం: జులై 21, 2025, ఉదయం 10:30 గంటలకు మంగళూరులోని సెయింట్ అలోసియస్ కళాశాల, రాబర్ట్ సెక్వేరా ఆడిటోరియంలో గణేశ స్తుతితో రెమోనా తన నాట్య యజ్ఞాన్ని ప్రారంభించింది.
ప్రదర్శన: ఏడు రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శనలో అలరిప్పు, జతిశ్వర, శబ్దం, వర్ణం, పదం, తిల్లాన వంటి భరతనాట్యంలోని విభిన్న రీతులను ప్రదర్శించింది. మొత్తం 61 రకాల కూర్పులతో, క్లిష్టమైన అడుగులు, ముద్రలు, భావోద్వేగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
నిరంతరాయ సాధన: ప్రతి మూడు గంటల ప్రదర్శనకు 15 నిమిషాల విరామం మాత్రమే తీసుకుంది. ఈ కొద్ది సమయంలోనే ఆమె భోజనం వంటి అవసరాలు తీర్చుకుంది. ఆమె గురువు శ్రీవిద్య మురళీధర్ చెప్పిన దాని ప్రకారం, రాత్రి పూట కేవలం ఒక గంట మాత్రమే నిద్రకు కేటాయించింది.
ముగింపు: జులై 28న మధ్యాహ్నం 12 గంటలకు దుర్గాదేవి స్తుతితో తన అద్వితీయ ప్రదర్శనను దిగ్విజయంగా ముగించింది.
గత రికార్డు బద్దలు: గతంలో మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన 16 ఏళ్ల శ్రుష్ఠి సుధీర్ జగ్‌పత్ 127 గంటల పాటు కథక్ నృత్యం చేసి నెలకొల్పిన రికార్డును రెమోనా బద్దలు కొట్టింది. ఈ ఘనత కోసం ఆమె గత రెండేళ్లుగా రోజుకు 5-6 గంటల కఠోర సాధన చేసింది.
తల్లి, గురువుల అండదండలు: ఈ ప్రదర్శన జరిగిన ఏడు రోజులూ రెమోనా తల్లి గ్లాడిస్ పెరీరా ఆమె వెన్నంటే ఉండి నైతిక మద్దతునిచ్చారు. గురువు, ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీవిద్య మురళీధర్ మార్గదర్శకత్వంలో రెమోనా ఈ శిఖరాన్ని అధిరోహించింది. శ్రీవిద్య, రెమోనా కోసం ప్రత్యేకంగా మూడు గంటల నిడివి గల భరతనాట్య ఆడియో సెట్‌ను సిద్ధం చేశారు.
గుర్తింపు – అభినందనలు: గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా అధిపతి డాక్టర్ మనీశ్ విష్ణోయ్, రెమోనాకు అధికారికంగా సర్టిఫికెట్‌ను అందజేశారు. సెయింట్ అలోసియస్ విశ్వవిద్యాలయ రెక్టర్ ఫాదర్ మెల్విన్ పింటో మాట్లాడుతూ, “ఇది మా కళాశాల చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన రోజు. రెమోనా కన్న కలను మనమందరం కలిసి నిజం చేశాం” అని హర్షం వ్యక్తం చేశారు.
చిన్ననాటి నుంచే నాట్యంపై మక్కువ: మూడేళ్ల వయసు నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాట్యంలో శిక్షణ ప్రారంభించిన రెమోనా, గత 13 ఏళ్లుగా శ్రీవిద్య మురళీధర్ వద్ద భరతనాట్యం అభ్యసిస్తోంది. భరతనాట్యంతో పాటు కూచిపూడి, కథక్, యక్షగానం వంటి ఇతర నృత్య రీతుల్లోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించింది.


