Kharge Calls GST Utsav ‘Band-Aid on Deep Wounds’: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “జీఎస్టీ ఉత్సవ్” ప్రారంభంగా అభివర్ణించారు. ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపులతో ఇప్పటికే లబ్ధి పొందుతున్న గృహాలకు ఈ సంస్కరణలు “డబుల్ బొనాంజా” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ప్రతిపక్షాల నుంచి తీవ్ర రాజకీయ ప్రతిఘటన వ్యక్తమైంది.
జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలకు ప్రధాని మోదీ క్రెడిట్ కొట్టేస్తున్నారని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక అడుగు ముందుకేసి, గత ఎనిమిదేళ్లుగా తన ప్రభుత్వం చేసిన “ఆర్థిక గాయాలను” కప్పిపుచ్చడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ALSO READ: PM Modi: నేటి అర్థరాత్రి నుంచే జీఎస్టీ 2.0 అమలు.. ప్రధాని మోదీ స్పీచ్ హైలైట్స్ ఇవే..!
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పన్ను విధానాన్ని “నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు”గా ప్రధాని మోదీ తన 19 నిమిషాల ప్రసంగంలో అభివర్ణించారు. ఇది “ఆత్మనిర్భర్ భారత్” దిశగా ఒక నిర్ణయాత్మక అడుగు అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ‘X’ (ట్విట్టర్) వేదికగా హిందీలో తీవ్రంగా స్పందించారు. “వంద తప్పులు చేసి తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది మీ తీరు! కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన సరళమైన, సమర్థవంతమైన జీఎస్టీకి బదులుగా, మీ ప్రభుత్వం 9 వేర్వేరు స్లాబులతో ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ విధించి, ఎనిమిదేళ్లలో రూ. 55 లక్షల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు రూ. 2.5 లక్షల కోట్ల ‘పొదుపు ఉత్సవం’ గురించి మాట్లాడుతూ, ప్రజలకు చేసిన లోతైన గాయానికి ఒక చిన్న బ్యాండ్-ఎయిడ్ వేస్తున్నారు,” అని ఆయన మండిపడ్డారు.
“పప్పు, బియ్యం, పుస్తకాలు, పెన్సిళ్లు, వైద్యం, చివరకు రైతుల ట్రాక్టర్లపై కూడా జీఎస్టీ వసూలు చేసిన మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. మీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి,” అని ఖర్గే డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రధానిపై విరుచుకుపడ్డారు. “జీఎస్టీ తగ్గింపు వల్ల మేము రూ. 20,000 కోట్ల ఆదాయం కోల్పోతున్నా, ప్రజల కోసం సంతోషంగా అంగీకరించాం. కానీ దీనికి మీరెలా క్రెడిట్ తీసుకుంటారు? జీఎస్టీ తగ్గించాలని కోరింది మేమే. కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ సూచన ఇచ్చింది మేమే,” అని ఆమె అన్నారు.
ALSO READ: GST reform: పాల నుండి కారు వరకు.. జీఎస్టీ 2.0లో ధరలు తగ్గనున్న వస్తువుల లిస్ట్ ఇదే..!
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ మాట్లాడుతూ, “2017లో అధిక జీఎస్టీ రేట్లు ప్రవేశపెట్టి పరిశ్రమలను, వ్యాపారులను, సామాన్యులను ఇబ్బంది పెట్టింది మోదీయే. ఇప్పుడు రేట్లు తగ్గించి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలపై మోపిన దోపిడీకి కూడా ఆయనే బాధ్యత వహించాలి,” అని అన్నారు.
ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. “#NextGenGST అనేది ప్రజల కేంద్రంగా జరిగిన సంస్కరణ. ప్రధాని మోదీ ప్రసంగం దేశానికి సానుకూల దిశానిర్దేశం చేస్తే, కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన విమర్శలతో ప్రతికూలతను వ్యాపింపజేస్తోందని” ఆమె విమర్శించారు. ఈ సంస్కరణలు పేదలు, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూరుస్తాయని, సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తాయని ఆమె పేర్కొన్నారు.
ALSO READ: Zubeen Garg: గాన గంధర్వుడు జుబీన్ గార్గ్ ఇకలేరు.. స్తంభించిన అస్సాం.. వీధుల్లో వేలాది జనం నివాళి


