Supreme Court RTI CIC Vacancies: దేశంలో సమాచార హక్కు (RTI) చట్టం అమలును బలహీనపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సెంట్రల్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లలో (CIC & SIC) ఖాళీలను భర్తీ చేయడంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ప్రస్తుతం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) లో చీఫ్ లేరని, మొత్తం 10 సమాచార కమిషనర్ల పోస్టులకుగాను ఎనిమిది ఖాళీగా ఉన్నాయని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సీఐసీ ముందు పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరుకుందని వారు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ, పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు “ఆర్టీఐని చంపేయడానికి” చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని ఆరోపించారు.
దీనిపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, సీఐసీ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండేలా చూస్తామని హామీ ఇచ్చింది. నియామకాలకు సంబంధించి నవంబర్ 17వ తేదీలోగా స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
నియామకాల్లో పారదర్శకతపై హామీ
సీఐసీ చీఫ్ నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీ ప్రక్రియ పూర్తైందని, మూడు వారాల్లోగా ఎంపిక కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తుందని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అయితే, గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దరఖాస్తుదారుల పేర్లను బహిరంగపరచడం లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తులకే నియామకాలు జరుగుతున్నాయని భూషణ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగితే తాము పరిశీలిస్తామని, పారదర్శకతను కచ్చితంగా పాటిస్తామని తేల్చి చెప్పింది.
రాష్ట్రాల్లోని సమాచార కమిషన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని పిటిషనర్లు దాఖలు చేసిన డేటాలో ఉంది. జార్ఖండ్ కమిషన్ ఐదేళ్లుగా నిలిచిపోయిందని, హిమాచల్ ప్రదేశ్ కమిషన్ కూడా పనిచేయడం లేదని తెలిపారు. దాదాపు 35,000 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో ఒకే ఒక్క కమిషనర్‌తో పనిచేస్తోందని తెలిపారు. కమిషనర్ల నియామకంలో జాప్యం వల్ల ప్రజల సమాచార హక్కు దెబ్బతింటోందని, అప్పీళ్లు పరిష్కరించడానికి ఏడాదికి పైగా ఆలస్యం అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.


