2 Assam Rifles Soldiers Killed: మణిపూర్‌లో మరోసారి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఇంఫాల్ శివార్లలో జరిగిన ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గురువారం సాయంత్రం 5.50 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు.
ALSO READ: BIHAR ELECTIONS: బిహార్‌పై అమిత్ షా ‘చాణక్య వ్యూహం’.. బలహీనంగా ఉన్న 100 సీట్లపైనే గురి!
పారామిలిటరీ బలగాలకు చెందిన ‘407 టాటా’ వాహనం తమ పట్సోయ్ ఆపరేటింగ్ బేస్ నుంచి నంబోల్ బేస్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దాడి జరిగిన ప్రాంతం ఇంఫాల్, చురాచంద్‌పూర్ మధ్యలో ఉంది. ఆసక్తికరంగా, ఈ రోడ్డు మీదుగానే వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ తన మణిపూర్ పర్యటనలో ప్రయాణించినట్లు సమాచారం.
“నంబోల్ సాబల్ లీకై జనరల్ ఏరియాలో, మణిపూర్ యొక్క ‘డి-నోటిఫైడ్’ ప్రాంతంలోని హైవేపై ప్రయాణిస్తున్న బలగాల కాన్వాయ్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అస్సాం రైఫిల్స్ సిబ్బంది అమరులయ్యారు, ఐదుగురు గాయపడ్డారు” అని అధికారిక ప్రకటన వెల్లడించింది. గాయపడిన జవాన్లను వెంటనే ఇంఫాల్‌లోని ప్రాంతీయ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS)కి తరలించారు.
ALSO READ: MK Stalin: “తమిళనాడులో బీజేపీని అడుగుపెట్టనివ్వం!”: సీఎం స్టాలిన్ శపథం
ప్రస్తుతానికి ఈ దాడికి తామే బాధ్యులమని ఏ గ్రూపు కూడా ప్రకటించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇలాంటి హింసాత్మక చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి దృఢ సంకల్పంతో ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు.
‘ఏఎఫ్‌ఎస్‌పీఏ’ (AFSPA) చట్టం మణిపూర్‌లోని ఐదు జిల్లాల్లోని 13 పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో మినహా, రాష్ట్రమంతటా అమలులో ఉంది. ఈ దాడి జరిగిన నంబోల్ ప్రాంతం బిష్ణుపూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది, ఇక్కడ AFSPA వర్తించదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధిత జాబితా ప్రకారం, మణిపూర్‌లో తొమ్మిది నిషేధిత మైతేయ్ ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి. గతంలో కూడా ఈ గ్రూపులు అస్సాం రైఫిల్స్‌పై దాడులు చేశాయి.


