Puri Jagannath Rath Yatra Stampede: ఒడిశాలో జరిగే పవిత్రమైన పూరి జగన్నాథ రథయాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మూడు రథాలు గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతల దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో కొందరు భక్తులు కింద పడిపోవడంతో తోపులాట సంభవించింది.
ఈ దుర్ఘటనలో ఊపిరి ఆడక ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఒడిశా ఖుర్దా జిల్లాకు చెందిన ప్రభాతి దాస్(42), బసంతీ సాహూ(36), ప్రేమకాంత్ మహాంతి (80)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని పూరీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సిద్దార్థ శంకర్ స్వైన్ స్పందించారు. తొక్కిసలాట కారణంగా ముగ్గురు చనిపోయారని తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినిట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఒడిశా మంత్రి పృథ్విరాజ్ హరిచందన్ ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష బీజేపీ ఈ ఘటనపై విమర్శలు చేస్తోంది. బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని.. ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పూరీలో ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. అలాంటి ప్రాముఖత్య ఉన్న ఈ రథయాత్రకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథయాత్ర సందర్భంగా దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారని.. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.