Ladakh Statehood Protests Turn Violent: శీతల ఎడారిగా ప్రసిద్ధి చెందిన లద్దాఖ్, బుధవారం నిరసనల సెగతో రగిలిపోయింది. ప్రత్యేక రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలంటూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో లేహ్ పట్టణం రణరంగాన్ని తలపించింది. భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పోలీసులతో సహా సుమారు 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో, అధికారులు లేహ్ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
ఏం జరిగింది?
కొంతకాలంగా లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గత 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక నాయకులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో వందలాది మంది యువకులు, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది.
ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు స్థానిక బీజేపీ కార్యాలయంపై దాడి చేసి, పార్టీ జెండాలను తొలగించి, భవనానికి నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలను దగ్ధం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో, చివరకు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లోనే నలుగురు మరణించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారి కోసం రక్తదానం చేయాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
ALSO READ: Gurpatwant Singh Pannun: ప్రధాని మోదీని బెదిరించిన ఖలిస్థానీ ఉగ్రవాది.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ
ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర..
ఈ హింసపై స్పందించిన లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా, ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని ఆరోపించారు. ఆందోళనకారులు ఒక వాహనంలో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారని, ఈ హింసకు, మరణాలకు నిరసనలను రెచ్చగొట్టిన వారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
హింస మన మార్గం కాదు
మరోవైపు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ హింస పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన శాంతియుత పోరాట సందేశం విఫలమైందని పేర్కొంటూ, వెంటనే తన నిరాహార దీక్షను విరమించారు. “గత ఐదేళ్లుగా మేము శాంతియుత మార్గంలోనే పోరాడుతున్నాం. హింస మన మార్గం కాదు. యువతలో పెరిగిన నిరుద్యోగం, వారి ఆకాంక్షలను వినిపించేందుకు ప్రజాస్వామిక వేదిక లేకపోవడమే ఈ ఆగ్రహానికి కారణం,” అని వాంగ్‌చుక్ అన్నారు. యువత శాంతియుతంగా ఉండాలని, ప్రభుత్వం కూడా లద్దాఖ్ ప్రజల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
VERY SAD EVENTS IN LEH
My message of peaceful path failed today. I appeal to youth to please stop this nonsense. This only damages our cause.#LadakhAnshan pic.twitter.com/CzTNHoUkoC— Sonam Wangchuk (@Wangchuk66) September 24, 2025
ALSO READ: Maoists surrender: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. చత్తీస్‌ఘడ్‌లో 71 మంది లొంగుబాటు..!
నేపథ్యం..
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతించినా, కాలక్రమేణా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో తమ భూమి, సంస్కృతి, ఉద్యోగాలకు రక్షణ కరువైందనే ఆందోళన పెరిగింది. దీంతో లేహ్‌లోని బౌద్ధులు, కార్గిల్‌లోని ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి ‘లేహ్ అపెక్స్ బాడీ’, ‘కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్’ పేరుతో ఉమ్మడిగా ఉద్యమం ప్రారంభించారు. కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిగినా, అవి విఫలమయ్యాయి. అక్టోబర్ 6న మరోసారి చర్చలకు కేంద్రం పిలుపునిచ్చినప్పటికీ, అంతలోనే ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘర్షణల కారణంగా, నాలుగు రోజులుగా జరుగుతున్న వార్షిక ‘లద్దాఖ్ ఫెస్టివల్’ను చివరి రోజున రద్దు చేశారు.
ALSO READ: Union Cabinet: బిహార్‌కు కేంద్రం వరాల జల్లు.. కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు మెడికల్ సీట్ల పెంపు


