అసోం-మేఘాలయ సరిహద్దులో దారుణ ఘటన జరిగింది. అసోం అటవీ అధికారుల కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై మేఘాలయ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు మేఘాలయలో ఇంటర్నెట్ కట్ చేశారు.
అసోం-మేఘాలయ మధ్య ఐదు దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య 884 కిలోమీటర్లకు సంబంధించి సరిహద్దు వివాదం ఉంది. ఈ విషయంపై రెండు రాష్ట్రాల మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సరిహద్దు విషయంలో సమస్య పరిష్కారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా అందుకు అంగీకరించారు. దాదాపు 70 శాతం వివాదాస్పద భూమిపై ఒక నిర్ణయానికి వచ్చారు.
మిగతా 30 శాతం భూమి సరిహద్దుపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేఘాలయకు చెందిన కొందరు వ్యక్తులు సరిహద్దు ప్రాంతం నుంచి కలప తీసుకెళ్తున్నారు. అది గమనించిన అసోం అటవీ శాఖ అధికారులు కలప తీసుకెళ్తున్న వాహనాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. అధికారుల కాల్పులను తిప్పికొట్టేందుకు జరిగిన ఘర్షణలో ఒక అటవీశాఖ అధికారి కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన మేఘాలయ సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.