తమిళనాడు(TamilNadu)లోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు(Explosion)సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని నాలుగు గదులు కూలి నేలమట్టమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు.
అప్పయ్య నాయకన్‌పట్టిలోని సాయినాథ్ అనే ప్రైవేట్ పటాసులు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.