8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బేతుల్ జిల్లా మాండవీలోని నానక్ చౌహాన్ అనే రైతు రెండేళ్ల క్రితం తన పొలంలో బోరు బావిని వేశాడు. ఆ బావిలో నీళ్లు అడుగంటిపోవడంతో నిరుపయోగంగా ఉంది.
మంగళవారం.. సాయంత్రం 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ఆ బావిలో పడిపోయాడు. కాగా.. ఆ బావిని కప్పి ఉంచానని, అందులో ఎలా పడిపోయాడో తెలియడం లేదని నానక్ చౌహాన్ పోలీసులకు చెప్పాడు. బోరుబావిలో బాలుడు 60 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలుస్తోంది. బాలుడికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీసి బాలుడిని బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.