8th Pay Commission Big Doubts: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చుట్టూ సందిగ్దత నెలకొంది. పెన్షనర్ల విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎలాంటి స్పష్టత లేదు, పెన్షనర్లంతా ఎందుకు యూనిఫామ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరుకుంటున్నారనే వివరాలు తెలుసుకుందాం.
8th Pay Commission Concerns and Doubts
వాస్తవానికి 8వ వేతన సంఘానికి సంబంధించి టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కేంద్ర కేబినెట్ నవంబర్ 3వ తేదీన ఆమోదించినప్పటి నుంచే ఈ సందిగ్దత ఉంది. ఎందుకంటే 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు అంటే 2014 ఫిబ్రవరి 28వ తేదీన ఆమోదించిన టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో 7th Pay Commission ToR పెన్షనర్లు పెన్షన్‌పై సమీక్ష చేయాలని స్పష్టంగా ఉంది. కానీ 8వ వేతన సంఘం టీఓఆర్‌లో మాత్రం అలాంటి స్పష్టత లేదు. నేషనల్ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు వర్తించేవారు, వర్తించనివారి డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్‌పై సమీక్షించాలని మాత్రమే ఉంది. నేరుగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల గురించి సమీక్షించాలని లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఇతర సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఆందోళన వెలిబుచ్చుతున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అసలు తమకు వర్తిస్తాయా లేవా అనే సందేహాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే వివిధ సంఘాలు కేంద్ర ఆర్దిక శాఖకు లేఖల ద్వారా విజ్ఞుప్తి చేశారు. 8వ వేతన సంఘం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను 8th Pay Commission ToR సవరించాలని లేదా ప్రత్యేకంగా సూచనలు జారీ చేయాలని కోరుతున్నారు. 7వ వేతన సంఘంలో ఉన్నంత స్పష్టత 8వ వేతన సంఘంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చేవరకు రిటైర్ అయినవారందరికీ సిఫార్సులు వర్తిస్తాయని కూడా అప్పట్లో స్పష్టత ఉంది. ఇలాంటి క్లారిటీ 8వ వేతన సంఘం టీఓఆర్‌లో లేకపోవడంతో పెన్షనర్లలో సహజంగానే ఆందోళన ఉంది.
ఈ క్రమంలో పెన్షన్ రివ్యూ చేసేందుకు యూనిఫామ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే యూనిఫామ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా పరిగణిస్తున్నారో అదే తమకూ వర్తించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ఉద్యోగులకు ఒక విధంగా తమకు మరో విధంగా ఉండకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి 8వ వేతన సంఘం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌పై పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమౌతోంది. సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల డిమాండ్ ప్రకారం సవరణ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

