8th Pay Commission Gazette: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘానికి సంబంధించి కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, సూచనలు, షరతులు ఇప్పుడు అధికారికమయ్యాయి. అయితే పెన్షనర్లకు 8వ వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయా లేవా అనే చర్చ మొదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు, టర్మ్స ఆఫ్ రిఫరెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదించిన తరువాత తాజాగా గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 3వ తేదీన వెలువడిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఏయే షరతులకు లోబడి కమిటీ పనిచేయాల్సి ఉంటుంది, ఏయే అంశాల్ని పరిగణలో తీసుకోవాలనేది స్పష్టంగా ఉంది. ఏయే ఉద్యోగులకు ఈ సిఫార్సులు వర్తిస్తాయో వివరణ ఉంది. అదే సమయంలో పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సిపార్సులు పెన్షనర్లకు వర్తించవా..అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
8వ వేతన సంఘం ఎవరెవరికి వర్తిస్తుంది
పారిశ్రామిక-పారిశ్రామికేతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు, ఢిఫెన్స్ రంగం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉద్యోగులు, ఇండియన్ ఆడిట్ అండ్ ఎక్కౌంట్స్ ఉద్యోగులు, రెగ్యులేటరీ బాడీ ఉద్యోగులు, సుప్రీంకోర్టు అధికారులు, సిబ్బంది, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని హైకోర్టు సిబ్బంది, జ్యుడీషియల్ అధికారులు ఈ 8వ వేతన సంఘం పరిధిలో వస్తారు.
8వ వేతన సంఘం ఏం చేయాలి
ఉద్యోగుల సామర్ధ్యం, బాధ్యత, ఎక్కౌంటెబిలిటీ పెంచే విధంగా పే స్కేల్ నిర్ణయం, ప్రస్తుతం ఉన్న వివిధ రకాల బోనస్‌లను పరిగణిస్తూ ఉద్యోగుల సామర్ధ్యం లేదా ఉత్పాదకత పెంచేలా సూచనలు చేయడం, ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ వర్తించేవారికి, వర్తించనివారికి ఇవ్వాల్సిన డెత్ కమ్ రిటైర్మెంట్ ప్రయోజనాలను పరిశీలించాల్సి ఉంటుంది.
షరతులేంటి
అయితే 8వ వేతన సంఘం సిఫార్సులు చేసేముందు దేశ ఆర్ధిక పరిస్థితి, వనరులను పరిగణలో తీసుకోవాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులకు కావల్సిన నిధులకు లోటు రాకుండా సిఫార్సులు ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితులు, ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పధకాలకు కావల్సిన నిధులకు లోటు రాకుండా కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగుల వేతనాలు, పనితీరు, పని చేసే పరిస్థితుల్ని పరిగణలో తీసుకోవాలి.
8వ వేతన సంఘం కమిటీ ఢిల్లీ కేంద్రంగా పనిచేసి 18 నెలల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ గెజిట్ నోటిఫికేషన్‌లో ఎక్కడా పెన్షనర్ల గురించి ప్రస్తావన లేకపోవడంతో సిఫార్సులు పెన్షనర్లుకు వర్తించవా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే 7వ వేతన సంఘం గెజిట్ నోటిఫికేషన్‌లో కూడా ఇదే పరిస్థితి. కానీ ఆ వేతన సంఘం అమలైనప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ప్రయోజనాలు వర్తించాయి. ఇప్పుడు కూడా 8వ వేతన సంఘం గెజిట్‌లో పెన్షనర్ల ప్రస్తావన లేకపోయినా సిఫార్సుల ప్రయోజనాలు పెన్షనర్లకు కచ్చితంగా వర్తించనున్నాయి.


