8th Pay Commission Twist: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పడటంతో ఏ మేరకు జీతభత్యాలు పెరగనున్నాయనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందనే అంశం పెద్ద సవాలుగా మారింది. దీనికి కారణం 8వ వేతన సంఘానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఆ వివరాలు మీ కోసం..
8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులు, పెన్షనర్లు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. జీతభత్యాలు భారీగా పెరిగిపోతాయని ఆశిస్తున్నారు. ఎందుకంటే గతంలో అంటే 7వ వేతన సంఘం అమలైనప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. దాంతో కనీస వేతనం ఒక్కసారిగా 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. ఇప్పుడు కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 నిర్ణయించాలనే డిమాండ్ విన్పిస్తోంది. లేదా గతంలో ఇచ్చినట్టే 2.57 ఇవ్వాలని కోరుతున్నారు. హీనపక్షంలో 2.46 ఉండవచ్చనే అంచనా కూడా ఉంది. ఇది సాధ్యమేనా అంటే కాదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదించిన కేంద్ర కేబినెట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు కమిటీకు బంధనాలుగా మారాయనే విమర్శ వస్తోంది. 8వ వేతన సంఘం కమిటీ ఈ షరతులను పరిగణలో తీసుకుని సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.
టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మెలిక ఏంటి
దేశ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసి సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ పధకాలకు నిధుల కొరత రాకుండా కమిటీ పరిగణలో తీసుకోవాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితిని కూడా ఆలోచించాలి. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పనితీరు, వేతనాలను గమనించాలి. అంటే కమిటీ ఇచ్చే సిఫార్సులు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితితో పాటు ప్రైవేట్ కంపెనీల పరిస్థితికి లోబడి ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సూచన లేదా మార్గదర్శకం.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు
ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించినంత ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే వివిధ ఆర్ధిక సంస్థల నుంచి కొన్ని అంచనాలు ఉన్నాయి. ఎంబిట్ కేపిటల్ సంస్థ అంచనా ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.83 నుంచి 2.46 మధ్యలో ఉండవచ్చు. ఇక కోడక్ ఈక్విటీ ప్రకారం అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.80 ఉండవచ్చు. ఇండిపెండెంట్ ఆర్ధిక వేత్తల విశ్లేషణ ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.9 నుంచి 2.1 ఉండవచ్చు.
2016లో ఇచ్చిన 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కంటే ఎక్కువైతే ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. దేశ ఆర్ధిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండటం, ప్రైవేట్ ఉద్యోగులను పరిగణలో తీసుకోవాలనడం వంటి షరతులు చూస్తుంటే కచ్చితంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.9 నుంచి 2.1 మధ్యే ఉండవచ్చని అంచనా ఉంది. అంటే పెద్దగా ఆశించనంత మార్పు ఉండకపోవచ్చు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటైతే చేసింది కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పేరుతో మెలిక పెట్టిందంటున్నారు విశ్లేషకులు.


