8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లలో కొన్ని ప్రధాన సందేహాలు విన్పిస్తున్నాయి. కొత్త వేతన సంఘం అమలయ్యాక పాత ఎరియర్లు చెల్లిస్తుందా లేదా అనే ప్రశ్న విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటుతో 50 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. వేతన సంఘం అనేది ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంటుంది. ఏమైనా పరిస్థితులు అనుకూలించకుంటే కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. దేశంలో మొదటి వేతన సంఘం 1947 జూలైలో ఏర్పడగా రెండవది 1957లో కాకుండా 1959లో ఏర్పడింది. ఆ తరువాత 1969లో కాకుండా 1973లో మూడవది ఏర్పడింది. నాలుగో వేతన సంఘం కూడా 1983లో కాకుండా 1986లో ఏర్పడింది. ఇక అక్కడి నుంచి క్రమం తప్పకుండా పదేళ్ల కోసారి ఏర్పడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పడగా 2016 జూన్ నెలలో ఆమోదం పొందింది. కానీ 2016 జనవరి నుంచి అంటే ఆరు నెలల ఎరియర్లతో పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది.
ఇప్పుడు 8వ వేతన సంఘం కమిటీ ఏర్పడి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లభించడంతో ఇప్పటి నుంచి 18 నెలల్లో కమీషన్ నివేదిక సమర్పించనుంది. అంటే 2027 జూన్ కావచ్చు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, ఆర్ధిక శాఖ ఆమోదం తీసుకుని, కేబినెట్ ఆమోదించడం వంటి పరిణామాలకు మరో ఆరు నెలల సమయం కచ్చితంగా పట్టవచ్చు. అంటే 2028 జనవరి నుంచి అమల్లోకి వస్తుందనేది ఓ అంచనా. అంటే అప్పటికి 24 నెలల ఎరియర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకూ 18 నెలల డీఏ-డీఆర్ నిలిపివేసింది. తాజాగా 2025 ఆగస్టులో ఆ బకాయిలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. 18 నెలల డీఏ బకాయిలు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వంపై పడే భారం 34 వేల కోట్లు.
కేంద్ర ప్రభుత్వం 34 వేల కోట్లే చెల్లించలేనప్పుడు అంతకు 3 రెట్లు ఉండే 24 నెలల ఎరియర్లు చెల్లిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. కోవిడ్ సమయంలో డీఏ బకాయిలు చెల్లించాలంటూ మొన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేమని స్పష్టం చేయడంతో ఉద్యోగ సంఘాలు కూడా ఆ డిమాండ్ విరమించుకున్నాయి. ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చాక 24 నెలల ఎరియర్లు చెల్లిస్తుందా లేదా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.


