Homeనేషనల్Aadhaar Deactivation : మరణించినా కొనసాగుతున్న ఆధార్... ఆందోళన కలిగిస్తున్న కోట్ల యాక్టివ్ కార్డులు!

Aadhaar Deactivation : మరణించినా కొనసాగుతున్న ఆధార్… ఆందోళన కలిగిస్తున్న కోట్ల యాక్టివ్ కార్డులు!

Deaths Aadhaar Card Deactivate : మీ ఆధార్ పదిలంగానే ఉందా? మరి మరణించిన మీ ఆత్మీయుల ఆధార్ కార్డు సంగతేంటి? బహుశా అదింకా సజీవంగానే ఉండి ఉండవచ్చు! దేశంలో కోట్లాది మంది తనువు చాలించినా, వారి ఆధార్ నంబర్లు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయనే విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఆధార్ దందా వెనుక ఉన్న కథేంటి..? దీనివల్ల పొంచి ఉన్న ముప్పేమిటి? ఈ గందరగోళంపై భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) ఏమంటోంది..? 

- Advertisement -


దేశ పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారిన ఆధార్ కార్డుల నిర్వహణలో భారీ లోపం బయటపడింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఒక దరఖాస్తుకు వచ్చిన సమాధానం, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. 16 ఏళ్ల క్రితం ఆధార్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు, కోట్లాది మంది మరణించినప్పటికీ, కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే ‘ఉడాయ్’ నిలిపివేసినట్లు తేలింది.

లెక్కల్లో తేడా.. భద్రతకు చిల్లు: గణాంకాలను పరిశీలిస్తే ఈ సమస్య తీవ్రత స్పష్టంగా అర్థమవుతుంది.

జనాభా-మరణాలు: సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారం, 2007-2019 మధ్య కాలంలోనే దేశంలో ఏటా సగటున 83.5 లక్షల మరణాలు సంభవించాయి. అంటే ఈ 16 ఏళ్లలో మరణించిన వారి సంఖ్య కోట్లలో ఉంటుంది.

డీయాక్టివేషన్: కానీ, ఉడాయ్ డీయాక్టివేట్ చేసిన ఆధార్ నంబర్ల సంఖ్య కేవలం 1.15 కోట్లు మాత్రమే. ఇది మరణించిన వారి సంఖ్యలో దాదాపు 10% మాత్రమే కావడం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితి: జూన్ 2025 నాటికి దేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు. మృతుల కార్డులను తొలగించకపోవడంతో ఈ సంఖ్య వాస్తవానికి దూరంగా ఉంది.

ఉడాయ్’ ఏమంటోందంటే :  ఈ గందరగోళంపై ఆర్టీఐ దరఖాస్తుకు ‘ఉడాయ్’ ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “మరణించిన వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. మరణించిన వారి కుటుంబ సభ్యుల నుండి సేకరించిన సమాచారం, మరియు రాష్ట్ర ప్రభుత్వాలచే అధికారికంగా జారీ చేయబడిన మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా తీసుకుని మేము ముందుకు సాగుతాము.
ఏటా ఎంతమంది మృతుల కార్డులను నిలిపివేస్తున్నామనే దానిపై మా వద్ద ప్రత్యేక డేటా లేదు,” అని ఉడాయ్ స్పష్టం చేసింది.

పొంచి ఉన్న ప్రమాదాలు: మృతుల ఆధార్ కార్డులు యాక్టివ్‌గా ఉండటం వల్ల ఎన్నో రకాల మోసాలకు ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పథకాల దుర్వినియోగం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, పింఛన్లను మృతుల పేరు మీద దక్కించుకునే ప్రమాదం ఉంది.

ఆర్థిక మోసాలు: బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక సేవలతో అనుసంధానమైన ఆధార్‌ను ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.

గుర్తింపు చోరీ: మృతుల ఆధార్‌ను ఉపయోగించి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించే ముప్పు పొంచి ఉంది.

ఈ నకిలీలను అరికట్టాలంటే, జనన-మరణాల వివరాలను నమోదు చేసే సివిల్ రిజిస్ట్రీ వ్యవస్థను, ఆధార్ డేటాబేస్‌ను తక్షణమే అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, ఆధార్ వ్యవస్థకే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News