Aadhaar Valid for Voter Roll Revision: బిహార్‌లో ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళన చేస్తున్న వారికి సుప్రీం కోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారు తమ ఓటును తిరిగి నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డును గుర్తింపు రుజువుగా సమర్పించవచ్చని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల జాబితాకు ఆధార్‌ను కూడా చేర్చాలని ధర్మాసనం ఆదేశించింది.
35 లక్షల మంది తిరిగి నమోదు చేసుకోవాలి..
రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని చెబుతుండగా, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఎంట్రీలను తీసివేస్తే సుమారు 35 లక్షల మంది తిరిగి నమోదు చేసుకోవాల్సి ఉందని కోర్టు అంచనా వేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 1లోగా పూర్తి చేయాలని జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చని తెలిపింది.
రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడుతున్నాయని ఆరోపిస్తున్న పార్టీలు, ఓటర్లకు సహాయం చేయడంలో ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించింది. “రాజకీయ పార్టీలు తమ బాధ్యతను నిర్వర్తించడం లేదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
ALSO READ: Supreme Court : ఆధారపడనంటే.. పెళ్లెందుకు చేసుకున్నట్టు?
పార్టీల బూత్-స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 1.6 లక్షల మంది బీఎల్ఏలలో కేవలం ఇద్దరు మాత్రమే అభ్యంతరాలు నమోదు చేశారని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఓటర్ల కంటే రాజకీయ పార్టీలు తక్కువ చైతన్యంతో ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ALSO READ: Domestic Violence : నోరా ఫతేహిలా నాజూకుగా లేవంటూ నరకం.. భార్యను బాడీ షేమింగ్ చేస్తూ భర్త పైశాచికం!
ఈ కేసులో సంబంధిత రాజకీయ పార్టీలన్నింటినీ ప్రతివాదులుగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 8న జరుగుతుందని తెలిపింది.


