Liquor ban at Siri Fort Sports Complex : ఆటలు ఆడాల్సిన చోట, మద్యం ఏరులై పారుతోందా? క్రీడాకారులకు స్ఫూర్తినివ్వాల్సిన ప్రాంగణం, ‘మద్యపాన ప్రియుల అడ్డా’గా మారిందా? దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) పరిధిలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి అనేక క్రీడలకు కేంద్రంగా ఉంది. మాజీ క్రికెటర్ మదన్‌లాల్ వంటి దిగ్గజాలు ఇక్కడ శిక్షణ ఇస్తుంటారు. అన్ని వయసుల క్రీడాకారులు, క్రీడాభిమానులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. అయితే, ఇటీవల ఈ ప్రాంగణంలో ఓ మద్యం దుకాణానికి లైసెన్స్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది.
రాజ్యసభలో సంజయ్ సింగ్ ఫైర్ : శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, DDA అధికారులపై నిప్పులు చెరిగారు.
నిబంధనల ఉల్లంఘన: “స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిబంధనల ప్రకారమే, ప్రాంగణంలో మద్యం సేవించడం, ధూమపానం చేయడం పూర్తిగా నిషిద్ధం. 2018లో మద్యం సేవించినందుకు 28 మంది సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర ఈ కాంప్లెక్స్‌కు ఉంది. అలాంటిది, ఇప్పుడు ఏకంగా మద్యం అమ్మకాలకు ఎలా అనుమతి ఇచ్చారు?” అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
RTIలో బయటపడ్డ నిజం: సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా DDAనే స్వయంగా, తాము మద్యం దుకాణానికి లైసెన్స్ ఇచ్చామని, అయితే అది నిబంధనలకు విరుద్ధమని అంగీకరించినట్లు సంజయ్ సింగ్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
భయాందోళనలు: “ఈ మద్యం అమ్మకాల వల్ల, క్రీడా ప్రాంగణం ఓ ‘షరాబ్ కా అడ్డా’ (మద్యపు అడ్డా)గా మారింది. దీంతో, అక్కడికి వచ్చే క్రీడాకారులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మద్యం అమ్మకాల లైసెన్స్‌ను రద్దు చేయాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. క్రీడా ప్రాంగణాల పవిత్రతను కాపాడాల్సిన అధికారులే, నిబంధనలను తుంగలో తొక్కి, మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

