Homeనేషనల్Abhishek Banerjee : అభిషేక్‌పై అమానుష దాడి.. హెల్మెట్ లేకుంటే ప్రాణాలు పోయేవన్న మమతా బెనర్జీ!

Abhishek Banerjee : అభిషేక్‌పై అమానుష దాడి.. హెల్మెట్ లేకుంటే ప్రాణాలు పోయేవన్న మమతా బెనర్జీ!

Abhishek Banerjee attacked in West Bengal : బెంగాల్ ఎన్నికల రాజకీయాలు ఎప్పుడూ వేడిపుట్టిస్తూనే ఉంటాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల తదనంతర పరిణామాలు ఇప్పుడు అక్కడ సరికొత్త ఉద్రిక్తతలకు దారితీశాయి. శనివారం నాడు దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పుర్ వీధులు ఒక్కసారిగా రణరంగంగా మారాయి. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికుల ముసుగులో ఉన్న కొందరు ఊహించని రీతిలో రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవడమే కాకుండా, ప్రాణాపాయ స్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి “సమయానికి హెల్మెట్ లేకపోతే అభిషేక్ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి” అంటూ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

- Advertisement -


ప్రాణాలు రక్షించిన హెల్మెట్: మమత తీవ్ర ఆగ్రహం : టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీపై జరిగిన ఈ దాడిపై బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తీవ్రంగా స్పందించారు. సోనార్‌పుర్ పర్యటనలో అభిషేక్ వెళ్తుండగా ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ హింసాకాండలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దాడి సమయంలో అభిషేక్ తలకు హెల్మెట్ ఉండటం వల్లే ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, లేదంటే అక్కడికక్కడే మరణించేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“ఎవరో అభిషేక్‌కు సమయానికి హెల్మెట్ పెట్టారు. లేకపోతే ఘోరం జరిగిపోయేది” అని మమత పేర్కొన్నారు. దాడి కారణంగా అభిషేక్ ముఖం, మెడ, వీపు భాగాలపై బలమైన దెబ్బలు తగిలాయని, పక్కటెముకల ప్రాంతంలో అంతర్గత గాయాలు కావడంతో ఛాతీలో రక్తపు గడ్డలు (Blood clots) ఏర్పడ్డాయని వెల్లడించారు

చికిత్స అందకుండా ఆసుపత్రులపై ఒత్తిళ్లు : అభిషేక్‌కు కనీస వైద్యం అందకుండా అధికార వర్గాలు, స్థానిక బీజేపీ శ్రేణులు ఆసుపత్రి నిర్వాహకులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాయని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. “నేను స్వయంగా ఆసుపత్రి యాజమాన్యంతో కూర్చున్నప్పుడు, పోలీసుల నుంచి వారికి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం గమనించాను” అని ఆమె వెల్లడించారు.

వైద్య సేవలను కూడా రాజకీయం చేయడం అత్యంత అమానవీయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తనకు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారని, అభిషేక్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారని ఆమె తెలిపారు.

రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించడమే లక్ష్యం: అభిషేక్ : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ బెనర్జీ ఈ దాడిని పూర్తిగా ఖండించారు.”ఇటీవలే బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీయే ఈ హింసకు వెనుక ఉండి నడిపించింది. ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే రాజకీయ ప్రత్యర్థులను శారీరకంగా అంతమొందించేందుకు బీజేపీ యత్నిస్తోంది” అని ఆయన ధ్వజమెత్తారు.

బీజేపీ ఎదురుదాడి: “కర్మ రిటర్న్ గిఫ్ట్” : టీఎంసీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేత కీయా ఘోష్ తీవ్రంగా తిప్పికొట్టారు. గత 15 ఏళ్లుగా తృణమూల్ ప్రభుత్వ హయాంలో బెంగాల్ ప్రజలు ఎదుర్కొన్న అకృత్యాలకు, హింసకు ఇది “కర్మ రిటర్న్ గిఫ్ట్” అని ఆమె అభివర్ణించారు. “మీరు ఏది నాటారో అదే మీకు తిరిగి లభిస్తుంది. కర్మ అంటే ఇదే” అంటూ వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదనంతర హింసలో బాధితులైన తమ పార్టీ మద్దతుదారులను పరామర్శించేందుకు శనివారం అభిషేక్ బెనర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పుర్ వెళ్లారు. అయితే, ఆయన అక్కడికి చేరుకోగానే స్థానికులుగా చెలామణి అవుతున్న ఒక గుంపు ఒక్కసారిగా “చోర్ చోర్” (దొంగ) అంటూ నినాదాలు చేస్తూ అభిషేక్ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లతో దాడికి దిగింది. కొందరు భౌతికంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడంతో పోలీసులు అతి కష్టం మీద హెల్మెట్ ధరించిన అభిషేక్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News