HomeTop StoriesCM Vijay team: నూతన పంథాలో సీఎం విజయ్‌ కేబినెట్‌ కూర్పు.. మంత్రుల నేపథ్యమేంటో తెలుసా?

CM Vijay team: నూతన పంథాలో సీఎం విజయ్‌ కేబినెట్‌ కూర్పు.. మంత్రుల నేపథ్యమేంటో తెలుసా?

About the new ministers of Tamilnadu: తమిళనాట ఎంతో ఉత్కంఠ రేపిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. విజయ్‌ తన క్యాబినెట్‌లో అనుభవం ఉన్నవారితో పాటు కొత్తవారికి కూడా చోటు కల్పించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని యువతకు చోటు కల్పించడం విశేషం. విజయ్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తొమ్మిది మంది టీవీకే నేతల బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/prime-minister-modi-visits-chandrababu-and-pawan-residences/

కేఏ సెంగొట్టియన్‌: ఈయనకు తమిళ రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. సెంగొట్టియన్‌ ప్రస్థానం సామాన్య కార్యకర్తగా మొదలై.. 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంజీఆర్‌ హయాంలో 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జయలలిత, పళనిస్వామి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఎంజీఆర్‌ మరణానంతరం జయలలితకు మంచి విధేయుడిగా ఉన్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామితో విభేదాల కారణంగా 2025 నవంబర్‌లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై.. ఆ తర్వాత విజయ్‌ సారథ్యంలోని టీవీకేలో చేరారు. అప్పటి నుంచి విజయ్‌కి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. తన రాజకీయ అనుభవం విజయ్‌కి ఎంతగానో పనికొచ్చింది.

ఆధవ్‌ అర్జున: విజయ్‌కి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ అయిన అర్జున.. ప్రస్తుతం భారత బాస్కెట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగానూ పనిచేస్తున్నారు. టీవీకేలో చేరకముందు వీసీకే పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగానూ కొంతకాలం పనిచేశారు. తాజాగా, విల్లివాకం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఎన్‌.ఆనంద్‌: టీవీకే ఆవిర్భావం, పార్టీ అభివృద్ధిలో సంస్థాగతంగా ఈయన కీలక పాత్ర పోషించారు. తమిళనాడు అంతటా పార్టీ క్షేత్రస్థాయి నెట్‌ వర్క్‌ను, ప్రచారాన్ని ఉర్రూతలూగించారు. 2006లో పుదుచ్చేరిలోని బుస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈయన్ను ‘బుస్సీ ఆనంద్‌’గా పిలుస్తుంటారు. తాజా ఎన్నికల్లో ఈయన టీ నగర్ నుంచి గెలుపొందారు.

ఎస్‌.కీర్తన: శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా గెలుపొంది.. విజయ్‌ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక్కడ ఒక మహిళ గెలవడం ఇదే మొదటిసారి. కీర్తన వయసు కేవలం 29 ఏళ్లే. 1996లో విరుధ్‌నగర్‌ జిల్లాలో పుట్టిన కీర్తన.. బీఎస్సీ మ్యాథమెటిక్స్‌, స్టాటస్టిక్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి పొలిటికల్‌ కన్సల్టెన్సీని తన కెరీర్‌గా ఎంచుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించకముందు షోటైమ్‌ కన్సల్టింగ్‌ ద్వారా హైదరాబాద్‌ టీడీపీ ఆఫీసులో పనిచేశారు. ఐప్యాక్‌ సంస్థల్లో పొలిటికల్‌ కన్సల్టెంట్‌గా, డిజిటల్‌ క్యాంపెయిన్‌ వ్యూహకర్తగానూ సేవలందించారు. టీడీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు సోషల్‌మీడియా క్యాంపెయినింగ్‌ చేశారు. తెలుగు అనర్గలంగా మాట్లాడగల కీర్తన.. విజయ్‌ కేబినెట్‌లో అతిపిన్న వయస్సురాలుగా రికార్డుకెక్కారు.

కేజీ అరుణ్‌రాజ్‌: మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన.. కేజీ అరుణ్‌రాజ్‌ వృత్తిరీత్యా వైద్యుడు. తన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని విజయ్‌ పార్టీలో చేరారు. టీవీకే పాలసీ రూపకల్పన, క్యాంపెయిన్‌ విభాగాలకు జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. నమక్కల్‌ జిల్లాలోని తిరుచెంగోడ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి కృష్ణగిరి పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌గానూ సేవలందించారు.

ఆర్‌.నిర్మల్‌ కుమార్‌: టీవీకే ముఖ్య నేతల్లో ఈయన కూడా ఒకరు. ఎన్నికల అనంతరం వామపక్షాలతో పొత్తులకు సంబంధించిన చర్చలు జరిపి వారి మద్దతు కూడగట్టడంలో, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. టీవీకే ఐటీ, సోషల్‌ మీడియా విభాగం చీఫ్‌గా పనిచేశారు. తాజాగా, మదురైలోని తిరుప్పరన్‌కుండ్రం నుంచి విజయం సాధించారు. ఇంజినీరింగ్‌, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రుడైన నిర్మల్‌.. టీవీకే ఐటీ, సోషల్‌ మీడియా విభాగం డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా ఉంటూ పార్టీ డిజిటల్‌ క్యాంపెయిన్‌కు బాధ్యతలు నిర్వర్తించారు.

ఎ.రాజ్‌మోహన్‌: ఈయన నటుడు, స్టాండప్‌ కమెడియన్‌. టీవీ యాంకర్‌, డైరెక్టర్‌ కూడా. టీవీకే ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఎగ్మూర్‌ నుంచి గెలుపొందారు.

పి. వెంకటరమణన్‌: టీవీకే కోశాధికారిగా పనిచేసిన వెంకటరమణన్‌ ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తాజాగా మైలాపుర్‌ నుంచి గెలుపొందారు.

డా. కేటీ ప్రభు: వృత్తి రీత్యా దంత వైద్యుడైన ప్రభు శివగంగై జిల్లాలోని కరైకుడి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఎన్‌టీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు సీమన్‌ను ఓడించి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News