బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గురువారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలోనే కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం దుండగుడు పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడి కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఆకాశ్ కైలాష్ కన్నోజియా ను శనివారం చత్తీస్ గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్, కోల్కతా షాలిమార్ మధ్య నడిచే జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో నిందితుడు ఆకాశ్ కైలాష్ కన్నోజియా ప్రయాణిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు, అతడిని దుర్గ్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ కైలాష్ కన్నోజియా జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్లు ముంబై పోలీసుల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్ పీఎఫ్ కు సమాచారం అందింది. ముంబై పోలీసులు అతని మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్, ఫోటోను ఆర్పీఎఫ్ తో పంచుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ వెంటనే దుర్గ్ కు ముందు ముంబై-హౌరా మార్గంలో ఉన్న రాజ్నంద్గావ్ స్టేషన్లో తమ సహచరులను అప్రమత్తం చేసింది. అయితే అక్కడ నిందితుడి ఆచూకీ లభించలేదు. అనంతరం దుర్గ్ రైల్వేస్టేషన్ లో రెండు బృందాలను మోహరించారు.
ముంబై పోలీసులు అందించిన ఫోటో ద్వారా అతని గుర్తింపును ధృవీకరించిన తరువాత, నిందితుడిని అదుపులోకి తీసుకొని దుర్గ్ లోని ఆర్ పిఎఫ్ పోస్ట్ కు తరలించారు. అనంతరం, ముంబై పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీసులు సాయంత్రానికి విమానంలో రాయ్ పూర్ చేరుకుని, అక్కడి నుంచి దుర్గ్ వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టనున్నారు. నిందితుడు రైలు ఇంజిన్ వెనుక జనరల్ క్లాస్ బోగీలో ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు.