దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్(RG Kar Incident) జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్(Sanjay Roy)కు స్థానిక కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వం తాజాగా కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు న్యాయస్థానం అంగీకరించింది.
మరోవైపు మాల్దా జిల్లాలో ఇవాళ జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నిందితుడికి మరణశిక్ష విధించకుండా జీవితఖైదు విధించడం ఏంటని మండిపడ్డారు. దోషికి మరణశిక్ష విధించాలని తాను మొదటి నుంచి కోరుతూనే ఉన్నానని చెప్పారు. మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తే అతడి పట్ల సమాజం మానవత్వాన్ని ప్రదర్శించాలా..? అని ప్రశ్నించారు. దారుణమైన నేరాలకు పాల్పడినప్పటికీ కొందరు నిందితులు పెరోల్‌పై విడుదలవుతున్నారని గుర్తుచేశారు. నేరస్తుడికి సరైన శిక్షపడకపోతే అతడు మళ్లీ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని మమతా వెల్లడించారు. ఇదిలా ఉంటే స్థానిక కోర్టు తీర్పుపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.