Tuesday, November 19, 2024
Homeనేషనల్Manipur | మండుతోన్న మణిపూర్... రంగంలోకి కేంద్ర బలగాలు

Manipur | మండుతోన్న మణిపూర్… రంగంలోకి కేంద్ర బలగాలు

మణిపూర్ (Manipur) లో మరోసారి హింస చెలరేగింది. కొన్నాళ్లు ఆగినట్టే ఆగిన మంటలు మళ్లీ మొదలయ్యాయి. మణిపూర్ నివురు గప్పిన నిప్పులా మారడంతో అడుగడుగునా భద్రతా దళాలు మోహరించాయి. హింసకు సంబంధించి మూడు కేసులు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేశారు. మణిపూర్ పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆదేశించారు.

- Advertisement -

ఈ క్రమంలో అదనంగా 50 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి. మొత్తంగా 5000 మంది భద్రతా దళాలు మణిపూర్ (Manipur) లో గస్తీ కాస్తున్నాయి. ఇక హింసకు సంబంధించిన మూడు కేసులో దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ తీసుకుంది. వీటిలో కుకీ తిరుగుబాటుదారులు, సీఆర్పిఎఫ్ కి మధ్య జరిగిన కాల్పుల కేసు కూడా ఉంది. ఇటీవల జరిగిన ఈ ఎన్కౌంటర్లో 11 మంది మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇంఫాల్ వ్యాలీలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మెడికల్ షాపులు మినహా ఏవీ తెరుచుకోవడం లేదు. కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్ కు వెళ్లే ప్రధాన రహదారుల్లో బలగాలను మోహరించారు.

కాగా, గత ఏడాది మణిపూర్ లో జరిగిన జాతుల మధ్య ఘర్షణలో 200 మంది ప్రాణాలు కోల్పోగా… వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా సర్దుకోకముందే గతవారం మళ్లీ హింస చెలరేగింది. నిరసన కారులు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసి… వారి వాహనాలను ధ్వంసం చేశారు. సీఎం బీరేంద్ర సింగ్ ఇంటిపై దాడికి కూడా విఫలయత్నం చేశారు. ఆందోళనలను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జిరిబామ్ జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆందోళనకారులు బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల ధ్వంసానికి పాల్పడ్డారు. మణిపూర్ లో సంక్షోభం ముదురుతుండటంతో శాంతిభద్రతల వైఫల్యానికి నిరసనగా బీజేపీ సారధ్యంలోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మద్దతు ఉపసంహరించుకుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో ఎన్ పీ పీ కి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News