Ebola Virus Alert: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ లాంటి దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఆయా దేశాలకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభణ నేపథ్యంలో భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు భారతీయులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆదివారం హెచ్చరించింది. అదే విధంగా ఆ దేశాల్లో నివసిస్తున్న భారతీయూలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read: https://teluguprabha.net/telangana/medigadda-l-and-t-office-burnt-to-ashes/
204 మంది మృతి
బుండిబుగ్యో’ రకం ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుండడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ‘గ్లోబల్ ఎమర్జెన్సీ’గా ప్రకటించింది. ఎబోలా వ్యాప్తికి కేంద్రమైన కాంగోలో ఇప్పటివరకు దాదాపు 867 కేసులు నమోదయ్యాయి. 204 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.
కాగా, భారత్‌లో ఇప్పటివరకు ఈ రకం ఎబోలా వైరస్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి 21 రోజుల ఆరోగ్య పర్యవేక్షణను తప్పనిసరి చేశాయి.
Also Read: http://teluguprabha.net/national-news/8-people-die-while-hunting-in-a-river-in-karnataka/
ఏపీలో అలర్ట్
ఇక, ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సదరు ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాలు, పోర్టుల్లోనే వైద్య పరీక్షలు చేయిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పీపీఈ, వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు సరిపడా ఉన్నాయని వివరించారు.

