Saturday, November 15, 2025
Homeనేషనల్Afghan Minister : అఫ్గాన్ మంత్రి భేటీలో మహిళలపై వివక్ష - దిల్లీ సాక్షిగా తాలిబన్ల...

Afghan Minister : అఫ్గాన్ మంత్రి భేటీలో మహిళలపై వివక్ష – దిల్లీ సాక్షిగా తాలిబన్ల తీరు!

Ban on women journalists in India : భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం పెను దుమారం రేపింది. ఈ భేటీకి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోగా, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది..? ఈ వివాదంపై కేంద్రం ఎందుకు ఆచితూచి స్పందించింది..? దీని వెనుక ఉన్న రాజకీయ పరిణామాలేంటి..?

- Advertisement -

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌కు విచ్చేసిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ, తన పర్యటనలో తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం, దిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలో ఆయన ఓ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించలేదన్న వార్తలు వెలువడటంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

శుక్రవారం జరిగిన ఈ మీడియా సమావేశానికి కేవలం ఎంపిక చేసిన పురుష జర్నలిస్టులు, అఫ్గాన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించకపోవడంతో, పలువురు మహిళా పాత్రికేయులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటన భారత మహిళా జర్నలిస్టులకు అవమానకరమని, తాలిబన్ల తిరోగమన భావజాలాన్ని భారత గడ్డపై ప్రదర్శించడం దారుణమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశంలో ముత్తఖీ భారత్-అఫ్గాన్ సంబంధాలు, వాణిజ్యం, భద్రత వంటి అంశాలపై మాట్లాడినప్పటికీ, మహిళా జర్నలిస్టుల పట్ల చూపిన వివక్షే ప్రధానంగా చర్చనీయాంశమైంది.

మాకేం సంబంధం లేదు: కేంద్రం : ఈ వివాదంపై విపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టడంతో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందించింది. శుక్రవారం జరిగిన ఆ మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అది పూర్తిగా అఫ్గాన్ రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమమని, అందులో తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొంది.

కేంద్రంపై విపక్షాల విమర్శల వర్షం : ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా దీన్ని “భారత మహిళా జర్నలిస్టులకు జరిగిన అవమానం”గా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం స్పందిస్తూ, “తోటి మహిళా సహోద్యోగులకు మద్దతుగా పురుష జర్నలిస్టులు ఆ సమావేశాన్ని బహిష్కరించాల్సింది,” అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, “తాలిబన్ల వివక్షపూరిత ఆచారాలకు భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ అనుమతించడం హాస్యాస్పదం,” అంటూ ఎద్దేవా చేశారు.

తాలిబన్ల పాలన తర్వాత తొలిసారి : 2021లో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత, భారత్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేసి, 2022లో ఒక ‘టెక్నికల్ మిషన్‌’ను ఏర్పాటు చేసింది. అయితే, ముత్తఖీతో జరిగిన తాజా సమావేశంలో, కాబూల్‌లోని ఈ టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి భారత రాయబార కార్యాలయం స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. తాలిబన్ల పాలన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే కీలక సమయంలో జరిగిన ఈ పర్యటన, మహిళా జర్నలిస్టుల వివాదంతో నీలినీడలు కమ్ముకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad