Shraddha Walkar Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా తీహార్ జైలులో ఉన్నాడు. ఆఫ్తాబ్ కు గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించినట్లు తెలిసింది. శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని నిందితుడు వైద్యులకు చెప్పినట్లు సమాచారం.తరచూ వేధించడం, శారీరకంగా హింసించడంతో విసుగెత్తిన శ్రద్ధా అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. అయితే, మే 3, 4 తేదీల్లో వీరి మధ్య ఈ అంశంపై వాదన జరిగింది. శ్రద్ధామాత్రం ఆఫ్తాబ్ తో కలిసి ఉండేందుకు ససేమేరా అనడంతోనే హత్యచేసినట్లు ఆఫ్తాబ్ చెప్పినట్లు తెలిసింది.
ఇదిలాఉంటే శ్రద్ధా హత్యకేసు అనంతరం ఆఫ్తాబ్ జైలు జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆఫ్తాబ్ తీహార్ జైలులో ఉంటున్నాడు. ఇక్కడ ఆఫ్తాబ్ ప్రవర్తన విచిత్రంగా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడిస్తున్నారట. ఆఫ్తాబ్ కేవలం జైలులోని ఇద్దరు ఖైదీలతోనే మాట్లాడుతున్నాడని జైలు అధికారులు వివరించారు. తీహార్ జైలులోని 4వ నెంబర్ సెల్‌లో ఉన్న ఆఫ్తాబ్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉంటున్నాడని, ఒకవేళ వేరేవారితో మాట్లాడాలి అని అనుకుంటే దొంగతనం కేసులో జైలుకు వచ్చిన ఆ ఇద్దరు ఖైదీలతో మాట్లాడుతున్నాడని జైలు అధికారులు పేర్కొన్నారు.
ఆ ఇద్దరు ఖైదీలతో ఆఫ్తాబ్ చెస్ సైతం ఆడుతున్నాడట. కానీ, ఎక్కువ సమయం మాత్రం ఒంటిరిగా ఉంటున్న ఆఫ్తాబ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్, నార్కో అనాల్ సిస్ పరీక్షలు ముగియడంతో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. ఆఫ్తాబ్ విధేయతపై ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.