Homeనేషనల్Artificial Intelligence: వైద్య రంగంలో ఏఐతో మెరుగైన సేవలు..వ్యాధుల ముందస్తు గుర్తింపునకు అవకాశం

Artificial Intelligence: వైద్య రంగంలో ఏఐతో మెరుగైన సేవలు..వ్యాధుల ముందస్తు గుర్తింపునకు అవకాశం

లక్నో, సెప్టెంబర్‌ 13(తెలుగుప్రభ): వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంతో వ్యాధులను ముందుగానే, కచ్చితంగా గుర్తించడంతో పాటు వైద్య సేవలను మరింత సమర్థంగా, అందుబాటులోకి తీసుకురావచ్చని నిపుణులు పేర్కొన్నారు. లక్నోలో నిర్వహిస్తున్న ‘ఏఐ మంథన్‌ 2.0’లో ‘ఏఐ ఫర్‌ హెల్త్‌కేర్‌’ అంశంపై ఆదివారం చర్చ జరిగింది. డాక్టర్స్‌ ఏఐ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ అమిత్‌కుమార్‌ దే మాట్లాడుతూ.. ఏఐ ద్వారా రూపొందే సమాచారాన్ని తుది సత్యంగా భావించరాదన్నారు. వైద్య రంగంలో సారాంశాలు, డేటా రూపకల్పన, ముసాయిదాల తయారీ వంటి పనులకు ఏఐ ఉపయోగపడుతుందని, అయితే మందుల మోతాదులు, వైద్య సమాచారం తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు.

- Advertisement -

ప్రత్యామ్నాయం కాదు.. సహాయక సాధనమే
డాక్టర్‌ లాల్‌ పాత్‌ల్యాబ్స్‌కు చెందిన డాక్టర్‌ అలోక్‌ శర్మ మాట్లాడుతూ డిజిటల్‌ పాథాలజీ, హెమటాలజీ, మైక్రోబయాలజీలో ఏఐతో పరీక్షలు, నివేదికల ప్రక్రియ మరింత వేగంగా, కచ్చితంగా మారుతుందని తెలిపారు. ఏఐ వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని, సహాయక సాధనంగా ఉపయోగపడుతుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన వినాయక్‌ పాఠక్‌ పేర్కొన్నారు.

మౌఖిక క్యాన్సర్‌ గుర్తింపులో వినియోగం
ఏఐ ఆధారిత సాధనాలు, ‘ఆరోగ్య సంకల్ప్‌’ యాప్‌తో మౌఖిక క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి నివారించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎయిమ్స్‌ న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ దీపికా మిశ్రా తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని 9 కేంద్రాల్లో తొలిదశలో 40,746 అనుమానిత కేసులను పరీక్షించగా.. 9,643 కేసులను అనుమానాస్పదంగా, 1,385 కేసులను అధిక ప్రమాదకరంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర సహా 48 గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని పరీక్షించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News