Homeనేషనల్AIIMS : కవలల గ్రామం.. మాతృత్వానికి సవాల్! కొడిన్హిలో ఎయిమ్స్ పరిశోధనలో విస్తుపోయే నిజాలు

AIIMS : కవలల గ్రామం.. మాతృత్వానికి సవాల్! కొడిన్హిలో ఎయిమ్స్ పరిశోధనలో విస్తుపోయే నిజాలు

Kodinhi Twin Village Study : సృష్టి విచిత్రమో.. జన్యువుల మాయాజాలమో తెలియదు కానీ, ఆ ఊరిలో అడుగుపెడితే ఎటు చూసినా ఒక్కే పోలికలతో ఉన్న మనుషులు కనిపిస్తారు. అదే కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న ‘కొడిన్హి’ (Kodinhi) గ్రామం. ప్రపంచంలోనే అత్యధిక కవలలు జన్మించే గ్రామంగా దీనికి అరుదైన గుర్తింపు ఉంది. ‘ట్విన్ టౌన్’గా ఖ్యాతి గాంచిన ఈ గ్రామం పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నప్పటికీ.. అక్కడి తల్లులకు మాత్రం ఈ ప్రత్యేకత ఒక పెను సవాల్‌గా మారిందని తాజా పరిశోధనలో తేలింది. కవలల పెంపకం అక్కడి తల్లుల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తోంది? ఎయిమ్స్ భోపాల్ (AIIMS Bhopal) బృందం నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసిన ఆందోళనకర విషయాలేమిటి? ఆ ఊరి తల్లుల వెతలు.. అక్కడి వింత పరిస్థితులపై  ప్రత్యేక కథనం.

- Advertisement -

మాతృత్వానికి పరీక్ష.. ఎయిమ్స్ సంచలన విషయాలు : కవలలు పుట్టడం ఆనందదాయకమే అయినా, వారిని పెంచడం తల్లులకు తలకు మించిన భారంగా మారుతోందని భోపాల్ ఎయిమ్స్, భువనేశ్వర్ వైద్యుల సంయుక్త అధ్యయనం వెల్లడించింది.

తల్లిపాలకు దూరం: నవజాత శిశువులకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషిస్తోంది. కానీ, కొడిన్హి గ్రామంలో కేవలం 4 శాతం మంది తల్లులు మాత్రమే తమ కవల పిల్లలకు ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలు ఇవ్వగలుగుతున్నారు.
పెరుగుతున్న ఒత్తిడి: ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలివ్వడం, వారి ఆలనాపాలనా చూడటం వల్ల తల్లులు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సుమారు 70 శాతం మంది తల్లులు పాలిచ్చే సమయంలో తీవ్రమైన అలసటను అనుభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఆహారపు అలవాట్లలో మార్పులు – ఆందోళనలో తల్లులు : సాధారణంగా కవల పిల్లలు నెలలు నిండకముందే పుట్టడం,  తక్కువ బరువుతో ఉండటం  జరుగుతుంది. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇలాంటి సమయంలో తల్లిపాలు అమృతంతో సమానం. కానీ, కొడిన్హిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

పాల కొరత భయం: ఇద్దరు పిల్లలకు పాలు సరిపోవేమోనన్న భయం (Anxiety) తల్లుల్లో ఎక్కువగా ఉంది. దీంతో ఆరు నెలల కంటే ముందే పిల్లలకు బయటి ఆహారం అలవాటు చేస్తున్నారు.
చాలామంది తల్లులు చనుబాలతో పాటు ఇతర ఆహారాన్ని కూడా ఇస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అయితే, కొంతమంది మాత్రం ఏడాది లేదా రెండేళ్ల వరకు కష్టపడి తల్లిపాలు కొనసాగిస్తున్నారు.

ప్రత్యేక విధానం అవసరం: ఎయిమ్స్ డైరెక్టర్ : కొడిన్హిలో ప్రస్తుతం 280 జతల కవలలు ఉన్నారని, ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని భోపాల్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధవానంద్ కర్ తెలిపారు. ఈ గ్రామానికి సాధారణ ఆరోగ్య విధానాలు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడి తల్లుల కోసం ప్రత్యేక పోషకాహార పథకాలు (Special Nutritional Schemes) రూపొందించాలి. కవలలకు ఏకకాలంలో పాలిచ్చే విధానాలపై తల్లులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక శిక్షణ, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కొడిన్హి.. ఒక అంతుచిక్కని రహస్యం : దాదాపు 2,000 కుటుంబాలు నివసించే కొడిన్హి గ్రామంలో ఇప్పటివరకు 550 జతలకు పైగా కవలలు జన్మించారు. పసిబిడ్డల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఇక్కడ కవలలు ఉన్నారు. ఒకే పాఠశాలలో సుమారు 80 మంది కవల విద్యార్థులు చదువుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరి ఆహారపు అలవాట్లు, నీళ్లు, గాలి.. ఇలా ఎన్నో కోణాల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా, ఈ ‘ట్విన్ మిస్టరీ’ (Twin Mystery) వెనుక ఉన్న అసలు కారణం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. కవలల సందడితో కళకళలాడే కొడిన్హి గ్రామం.. తెరవెనుక తల్లుల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోందన్నది ఈ ఎయిమ్స్ నివేదిక ద్వారా స్పష్టమైంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్కడి తల్లులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News