Air India Air bus 350 Engine Damage: ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఎయిర్ ఇండియా విమానం లగేజ్ కంటైనర్‌ను లోపలికి లాగడంతో దాని ఇంజిన్లలో ఒకటి దెబ్బతిన్న సంఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచులో ఎయిర్‌బస్ A350 ఈ ప్రమాదానికి గురైంది.
ఇరాన్ గగనతలం మూసివేత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం ఇరాన్ గగనతలం మూసివేత కారణంగా కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో విమానం తిరిగి ల్యాండ్ అవుతుండగా.. దట్టమైన పొగమంచు కారణంగా బ్యాగేజ్ కంటెయినర్ కనిపించకపోవడంతో ఇంజిన్ దానిని లాగేసుకుంది. దీంతో విమానం కుడివైపు ఇంజిన్ దెబ్బతింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ప్రతినిధి వివరాలు వెల్లడించారు.
ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానం సురక్షితంగా పార్కింగ్ స్థలంలోనే ల్యాండ్ అయిందని పేర్కొంది. ఘటనపై సమగ్ర దర్యాప్తు, అవసరమైన మరమ్మతుల కోసం విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ కారణంగా ఎయిర్‌బస్ A350 మార్గాల్లో అంతరాయాలు ఏర్పడవచ్చని.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పనిచేస్తున్నట్లు వివరించింది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపిన సంస్థ.. రీఫండ్‌లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

