Ahmedabad Flight Accident Investigation :నింగిలోకి దూసుకెళ్లిన విమానం.. కొద్దిసేపట్లోనే నేలకూలి, 270 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీరుమున్నీరు చేసింది. ఎవరికీ అర్థం కాని ఆ మృత్యు కేక వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు తేటతెల్లమైంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. రెండు కీలకమైన ఇంజన్ స్విచ్‌లు కేవలం ఒక్క సెకన్ పాటు ఆగిపోవడమే ఈ పెను విషాదానికి కారణమని స్పష్టం చేసింది. అసలు ఆ సెకన్ పాటు ఏం జరిగింది? పైలట్ల మధ్య ఏం సంభాషణ జరిగింది? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందన ఎలా ఉంది?
విమాన ప్రమాదం: అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటన దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. విమానం గాల్లోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోవడంతో, మొత్తం 240 మంది ప్రయాణికులతో పాటు మరో 30 మంది సిబ్బంది సహా 270 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఫోటోలు, వీడియోలు, బ్లాక్ బాక్స్ డేటాతో పాటు ఇతర కీలక ఆధారాలను సేకరించి, క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ పరిశీలన అనంతరం వెలువడిన ప్రాథమిక నివేదికలో విస్మయకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ అయిన తర్వాత, ఇంజిన్ ఇంధన కంట్రోలర్ స్విచ్‌లను అనుకోకుండా లేదా ప్రమాదవశాత్తు సెకన్ పాటు ఆపివేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. విస్తుపోయే విషయం ఏమిటంటే, రెండు ఇంజిన్ల ఇంధన నియంత్రణ స్విచ్‌లూ ఒకేసారి ఆగిపోయాయి. ఈ అనూహ్య పరిణామంపై రెండో పైలెట్ వెంటనే మెయిన్ పైలెట్‌ను ప్రశ్నించినట్లు నివేదికలో ఉంది. “వాటిని ఎందుకు ఆఫ్ చేశావు?” అని రెండో పైలెట్ అడగగా, “నేను స్విచాఫ్ చేయలేదు” అని మొదటి పైలెట్ సమాధానం ఇచ్చారని నివేదిక పేర్కొంది. పరిస్థితి విషమించిందని గ్రహించిన మొదటి పైలెట్ వెంటనే ‘మేడే కాల్’ (అత్యవసర సహాయం కోసం పిలుపు) ఇచ్చారు.
ATC స్పందన – ప్రయోజనం లేకుండా పోయింది : పైలెట్లు ‘మేడే కాల్’ ఇచ్చిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) అప్రమత్తమై తక్షణమే స్పందించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని, విమానం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని AAIB వివరించింది. ATC స్పందించే లోపే విమానం నేలకూలి, పెను విషాదం చోటుచేసుకుందని నివేదిక స్పష్టం చేసింది.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి విమానానికి సంబంధించిన రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు AAIB తెలిపింది. తదుపరి లోతైన పరీక్షల కోసం వాటిలోని కీలక కాంపోనెంట్స్‌ను గుర్తించి, భద్రపరిచినట్లు వెల్లడించింది. ప్రమాదానికి ముందు విమానంలో ఇంధనం, బరువు పరిమితుల్లోనే ఉన్నాయని, ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు కూడా లేవని AAIB తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక నివేదిక మరిన్ని దర్యాప్తులకు మార్గం సుగమం చేసింది, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవసరమైన చర్యలను సూచించనుంది.


