Air India Crash Body Mix-Up: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఇది పుండు మీద కారం చల్లినట్లయింది. కడసారి చూపు దక్కుతుందనుకున్న బంధువులకు తీరని వేదన మిగిలింది. ప్రమాదంలో మరణించిన తమ వారి మృతదేహాలకు బదులుగా గుర్తుతెలియని వ్యక్తుల అవశేషాలు చేరడంతో బ్రిటన్‌లోని రెండు కుటుంబాలు కకావికలమయ్యాయి. ఇంతటి దారుణ తప్పిదం ఎలా జరిగింది..? భారత అధికారులు చేసిన డీఎన్ఏ పరీక్షల్లో లోపం ఎక్కడుంది…? తమ వారి అంత్యక్రియల కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల వేదనకు బదులేది…?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. తమ వారిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, కొందరి మృతదేహాలు తారుమారైన వార్త వారిని మరింత కుంగదీసింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరు బ్రిటన్ పౌరుల మృతదేహాలను తప్పుగా గుర్తించి వారి కుటుంబాలకు పంపినట్లు లండన్‌లో నిర్వహించిన డీఎన్ఏ పరీక్షల్లో వెల్లడైంది. ఈ నిర్లక్ష్యం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/himachal-pradesh-floods-monsoon-fury-landslides-death-toll/
బయటపడిన నిజం.. అంత్యక్రియలు ఆగిపోయాయి:
ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 53 మంది బ్రిటన్ జాతీయులు ఉన్నారు. వీరిలో 12 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బ్రిటన్‌కు తరలించారు. అయితే, యూకేలో అనుమానాస్పద మరణాలను విచారించే ‘కరోనర్’ (Coroner) ఈ మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాధిత కుటుంబాల తరఫున వాదిస్తున్న ‘కీస్టోన్ లా’ సంస్థ న్యాయవాది వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక కుటుంబానికి పంపిన శవపేటికలో ఉన్నది వారి కుటుంబ సభ్యుడి మృతదేహం కాదని, అది గుర్తు తెలియని మరో వ్యక్తిదని డీఎన్ఏ పరీక్షలో తేలింది. ఈ విషయం తెలియడంతో ఆ కుటుంబం అంత్యక్రియలను నిలిపివేసింది. మరో శవపేటికలో ఏకంగా ఇద్దరు వేర్వేరు వ్యక్తుల శరీర అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ భయంకర నిజాన్ని గ్రహించిన ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.
భారత్‌లోనే చాలా మంది అంత్యక్రియలు:
ప్రమాదంలో మరణించిన 53 మంది బ్రిటన్ పౌరులలో చాలా మంది కుటుంబ సభ్యులు తమ మత విశ్వాసాల ప్రకారం భారత్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. కేవలం 12 మంది మృతదేహాలను మాత్రమే బ్రిటన్‌కు పంపారు. ఈ మృతదేహాలన్నింటికీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, బంధువుల నమూనాలతో సరిపోల్చిన తర్వాతే అప్పగించారు. అయినప్పటికీ ఇంత పెద్ద పొరపాటు జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పుడు మృతదేహాలతో తీరని వేదన:
“గత నెల రోజులుగా నేను బ్రిటన్‌లోని బాధిత కుటుంబాలతోనే ఉన్నాను. తమ ఆప్తుల మృతదేహాలను వెనక్కి పొందేందుకు వారు పడుతున్న ఆవేదన మాటల్లో చెప్పలేనిది. కొందరు తప్పుడు మృతదేహాలను అందుకొని తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ తప్పులను సరిదిద్దడానికి ఇంకా కొన్ని వారాలు పట్టవచ్చు,” అని బాధితులకు సహాయం అందిస్తున్న ఏవియేషన్ న్యాయవాది జేమ్స్ హేలీ ప్రాట్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు ఎయిర్ ఇండియా, కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనే సంస్థను నియమించినప్పటికీ, ఈ ఘటన వారి పనితీరును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ఘోర విమాన ప్రమాదంపై ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగిస్తోంది.


