Air India Flight Safety Auditor Found Dead: ముంబైకి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ సేఫ్టీ ఆడిటర్ ఒకరు హర్యానాలోని గురుగ్రామ్‌లో తాను అద్దెకు ఉంటున్న పీజీ గదిలో శవమై కనిపించడం కలకలం సృష్టించింది. మృతుడిని ప్రఫుల్ సావంత్గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముంబై నివాసి అయిన సావంత్ కొన్ని రోజులుగా సెక్టార్ 30లోని గౌరవ్ పీజీలో ఉంటున్నాడు.
తలుపు గడియ పెట్టి ఉంది
పీజీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ప్రఫుల్ సావంత్ సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత తన గదికి తిరిగి వచ్చారు. మధ్యాహ్న భోజనం కోసం కేర్‌టేకర్‌కు యూపీఐ ద్వారా డబ్బు కూడా పంపించారు. అయితే, భోజనం గురించి అడగడానికి కేర్‌టేకర్ ఫోన్ చేసినప్పుడు, సావంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
పదేపదే ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో, కేర్‌టేకర్ సావంత్ గది వద్దకు వెళ్లారు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో పాటు, లోపల మొబైల్ ఫోన్ మోగుతూ వినిపించింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ప్రఫుల్ సావంత్ మంచంపై విగత జీవిగా పడి ఉన్నాడు.
ఉదయం వరకు సాధారణంగానే ఉన్నారు
“సావంత్ దినచర్య సాధారణంగానే ఉండేదని, ఉదయం వరకు ఎలాంటి సమస్యలు లేవని పీజీ సిబ్బంది చెప్పారు” అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
“గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. ఈ సంఘటన గురించి మరింత సమాచారం సేకరించేందుకు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించాం. అలాగే, పీజీలోని ఇతర సిబ్బందిని, నివాసితులను కూడా ప్రశ్నించాం” అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.


