Air India, IndiGo to Operate Additional Flights: నేపాల్ రాజధాని ఖాట్మండులో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో అదనపు విమానాలను నడుపుతున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ఛార్జీలను నియంత్రించి, సహేతుకమైన స్థాయిలో ఉంచాలని కూడా విమానయాన సంస్థలకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు.
‘నేపాల్‌లో విమానాశ్రయం మూసివేయడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఖాట్మండు నుంచి తిరిగి రాలేకపోయారు. అయితే, ఇప్పుడు ఖాట్మండులో విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియా, ఇండిగో సమన్వయంతో ఈరోజు సాయంత్రం, అలాగే వచ్చే కొద్ది రోజుల్లో అదనపు విమానాలను ఏర్పాటు చేశాయి. రేపటి నుంచి సాధారణ సేవలు కూడా పునరుద్ధరిస్తున్నాం,’ అని నాయుడు Xలో పోస్ట్ చేశారు.
నేపాల్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేయడానికి, ఎయిర్ ఇండియా ఈరోజు, రేపు ఢిల్లీ నుంచి ఖాట్మండుకు, తిరిగి ఢిల్లీకి ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. నేపాల్‌లో నెలకొన్న అశాంతి కారణంగా ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయబడింది. బుధవారం నుంచి విమానాశ్రయం తిరిగి తెరుచుకుంది. దీంతో భారతీయులను సురక్షితంగా రప్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
నేపాల్ సంక్షోభం ఎందుకు..
సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన నిరసనలు, అనతికాలంలోనే వ్యవస్థీకృత అవినీతికి వ్యతిరేకంగా భారీ ఉద్యమంగా మారాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ప్రధాని కేపీ ఓలీ మంగళవారం రాజీనామా చేయగా, దేశం రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటు కోసం సైన్యంతో చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ALSO READ: Nepal Crisis: నేపాల్ సంక్షోభం.. సైన్యంతో చర్చలకు మాజీ సీజే సుశీలా కర్కీ.. యువత సంచలన నిర్ణయం!


