Akhilesh Yadav Facebook Suspension : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌కు గురవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు 80 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా అందుబాటులో లేకుండా పోయింది. ఈ పరిణామంపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయం లేదని, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ అఖిలేశ్ ఖాతా ఎందుకు సస్పెండ్ అయింది? దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
అఖిలేశ్ యాదవ్ తన రాజకీయ అభిప్రాయాలను, ప్రభుత్వ విధానాలపై విమర్శలను పంచుకోవడానికి, మద్దతుదారులతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఫేస్‌బుక్‌ను చురుకుగా వినియోగిస్తుంటారు. అలాంటిది, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పేజీని సస్పెండ్ చేయడంపై ఎస్పీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎస్పీ నేతల ఆరోపణలు: ప్రజాస్వామ్యంపై దాడి: ఈ ఘటనను సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఫక్రుల్ హసన్ చాంద్ ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని, ప్రతిపక్షాల గొంతును అణచివేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
పాలకపక్షం కుట్ర: ఈ చర్య వెనుక పాలకపక్షం (బీజేపీ) హస్తం ఉందని ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ ఆరోపించారు. దేశ పార్లమెంటులో మూడో అతిపెద్ద పార్టీ నాయకుడి ఖాతాను బ్లాక్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు.
ఫేస్‌బుక్ హద్దులు దాటింది: ఎటువంటి నోటీసు లేకుండా ఖాతాను సస్పెండ్ చేయడాన్ని ఎస్పీ ఎమ్మెల్యే పూజా శుక్లా, మరో నేత పవన్ పాండే తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ఒక సాధారణ ఖాతా కాదని, కోట్లాది మంది ప్రజల గొంతుక అయిన అఖిలేశ్ యాదవ్ ఖాతా అని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ వర్గాల వాదన: అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఈ చర్య తీసుకుందని, ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా, హింసాత్మక, లైంగిక పోస్ట్ చేశారనే ఆరోపణలతోనే అఖిలేశ్ ఫేస్‌బుక్ పేజీని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం: అఖిలేశ్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌పై ఎస్పీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #RestoreAkhileshPage అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ ఫేస్‌బుక్‌పై తమ నిరసనను తెలుపుతున్నారు.
ఖాతా పునరుద్ధరణ: అయితే, శనివారం ఉదయానికి అఖిలేశ్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా పునరుద్ధరించబడింది. ఖాతా పునరుద్ధరణ తర్వాత, “సమాజంలోని అత్యంత అణగారిన వ్యక్తిని అధికార శిఖరాగ్రాన చూడటమే నా మొత్తం విప్లవానికి ఉన్న ప్రాముఖ్యత” అని ఆయన పోస్ట్ చేశారు. ఖాతా ఎందుకు సస్పెండ్ అయింది, ఎలా పునరుద్ధరించబడింది అనే దానిపై ఫేస్‌బుక్ లేదా సమాజ్‌వాదీ పార్టీ నుండి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.


